సుందరీకరణ.. నాణ్యత విస్మరణ
eenadu telugu news
Published : 23/10/2021 05:30 IST

సుందరీకరణ.. నాణ్యత విస్మరణ


విభాగిని మధ్యలో మొరం

న్యూస్‌టుడే, తాండూరు: పట్టణంలో సుందరీకరణ పేరుతో జరుగుతున్న పనులు అస్తవ్యస్తంగా చేపడుతున్నారు. నిధులు మంజూరు అయ్యాయనే ఉత్సాహంతో అధికారులు పనుల్లో వేగం పెంచినా, నాణ్యతను విస్మరిస్తున్నారు. గుత్తేదారుకు బిల్లులను చెల్లించాలంటే నాణ్యతా విభాగం వారు పరిశీలించాల్సి ఉన్నా, ఎవరూ పట్టించుకోవడంలేదు. రూ.40 లక్షల వ్యయంతో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల్లో ఇదే వ్యవహారం నెలకొంది.

మట్టికి బదులు: విలియమ్‌ మూన్‌ కూడలి నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు ఉన్న ప్రధాన రహదారి మధ్యలో పూల మొక్కలు పెంచేందుకు విభాగిని పనులు చేపట్టారు. మధ్యలో మెత్తటి ఎర్రమట్టిని పోయాలి. రాళ్లతో కూడిన మొరంతో నింపేశారు. ఇదంతా కళ్ల ముందే జరిగినా అధికారులు స్పందించక పోవడం విమర్శలకు తావిస్తోంది.

రూ.20 లక్షల పనుల్లో కూడా: తాండూరు బస్‌స్టేషన్‌ నుంచి కొడంగల్‌ వైపు రహదారిలో 900 మీటర్ల వంతెన ఉంది. 2006లో రూ.10.56 కోట్లతో దీన్ని నిర్మించారు. వాహనాలు సౌకర్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. వంతెన కింది భాగం మాత్రం పూర్తిగా అపరిశుభ్రంగానే ఉంది. ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలని రహదారులు, భవనాల శాఖ నిర్ణయించింది. రూ.20 లక్షల వ్యయంతో మూడేళ్ల కిందటే గుత్తేదారు పనులను చేపట్టారు. అలంకరణ, పూల మొక్కలకు రక్షణగా ఇనుప చువ్వలతో కంచెను ఏర్పాటు చేశారు. పనులు పూర్తవడంతో ఆ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారింది. ఆహ్లాదంగా ఉండే ప్రాంతం అపరిశుభ్రమైంది.

పొడి మట్టి లభించకనే...

విలియమ్‌మూన్‌ కూడలి నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు నిర్మించిన విభాగిణి మధ్యలో ఎర్రటి పొడి మట్టి లభించకనే మొరం పోయించాం. ఇందులోనూ మొక్కలు పెరుగుతాయి. నిర్వహణ మున్సిపాలిటీ చూసుకుంటుంది. వంతెన కింద సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. మిగిలినవి మున్సిపాలిటీ వారే చేపట్టాల్సి ఉంది.

-శ్రీనివాస్‌, రహదారులు భనాల శాఖ ఉపకార్యనిర్వాహక ఇంజినీరు, తాండూరు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని