దిగుబడి లేక దిగుమతి
eenadu telugu news
Published : 23/10/2021 05:30 IST

దిగుబడి లేక దిగుమతి


మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లి బస్తాలు

న్యూస్‌టుడే, తాండూరు: కూరల్లో నిత్యం వినియోగించే ఉల్లి ధర ఘాటెక్కింది. టోకు విపణిలో క్వింటా ధర రూ.3000 పలికితే, రిటేల్‌గా రూ.4,000 అమ్ముతున్నారు. ప్రస్తుతం జిల్లాలో రైతుల వద్ద ఉత్పత్తులు లేకపోవడంతో డిమాండ్‌ పెరిగింది. దీంతో తాండూరు, వికారాబాద్‌లోని టోకు వ్యాపారులు మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

మహారాష్ట్ర నాసిక్‌, షోలాపూర్‌ ప్రాంతాల్లో వేల ఎకరాల్లో పంట సాగు చేశారు. దిగుబడులు చేతికి అందుతాయనే సమయంలో వర్షాలు భారీగా కురవడంతో దెబ్బతిని దిగుబడులు ఆశించిన స్థాయిలో రాలేదు. ట్రేడర్లు తాము కొనుగోలు చేసిన ఉత్పత్తుల ప్రకారం వారంలో మూడు రోజులకు ఒకసారి 170 నుంచి 200 టన్నులు లారీల్లో జిల్లాకు పంపిస్తున్నారు. మహారాష్ట్రలో క్వింటా రూ.1800 నుంచి రూ.2000 చొప్పున కొనుగోలు చేసిన జిల్లా వ్యాపారులు రూ.3,000 నుంచి 4,000 చొప్పున చిల్లర వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

జూన్‌ వరకు రూ.1500: జూన్‌ వరకు క్వింటా రూ.1500 అమ్మారు. చిల్లర వ్యాపారులు ప్రతి కిలో వద్ద రూ.5 లాభం చూసుకుని రూ.20 చొప్పున విక్రయించారు. ప్రస్తుతం జిల్లాలో దిగుబడులు లేకపోవడంతో కొరత ఏర్పడి, దిగుమతి చేసుకోవడంతో డిమాండ్‌ పెరిగింది. అదే స్థాయిలో ధరలు పెరిగాయి. జిల్లాలో ఉల్లిగడ్డల కొరత ఫిబ్రవరి వరకు ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నాట్లు వేస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువ ధరలు పలుకుతున్న నేపథ్యంలో 1,500 ఎకరాల్లో సాగు చేసేందుకు సన్నద్ధమయ్యారు. తాండూరు, వికారాబాద్‌, పరిగి మండలాల్లో ఎక్కువ సాగవుతుంది. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న ప్రకారం 1.20లక్షల క్వింటాళ్ల దిగుబడి రావొచ్చని పెద్దేముల్‌ మండల ఉద్యాన శాఖ అధికారిణి కమల అంచనా వేశారు. ఈ సారి ప్రభుత్వం విత్తనాలను రాయితీ కింద పంపిణీ చేయక పోవడంతో రైతులు తమకు నచ్చిన వాటిని ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని