ఉపాధ్యాయులను నియమించండి.. లేదంటే పాఠశాల మూసేయండి
eenadu telugu news
Published : 23/10/2021 05:30 IST

ఉపాధ్యాయులను నియమించండి.. లేదంటే పాఠశాల మూసేయండి


డీఈవోకు ఫిర్యాదు చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

బషీరాబాద్‌, న్యూస్‌టుడే: మేడం.. ఉర్దూ పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించండి..లేదంటే మూసేయండి.. పిల్లలను ప్రైవేటు పాఠశాలకు, తెలుగు మాధ్యమానికి పంపిస్తామంటూ బషీరాబాద్‌ ఉర్దూ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాధికారికి మొరపెట్టుకున్నారు. శుక్రవారం జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి పాఠశాలను సందర్శించారు. ఆమెకు బడి పరిస్థితిని వివరించారు. ఇక్కడ 6-10 తరగతి వరకు 43 మంది విద్యార్థులున్నారని, ఉర్దూ బోధన చేసేవారు లేరు. తెలుగు, బయోసైన్స్‌ (జీహెచ్‌ఎం) ఇద్దరూ తెలుగు మాధ్యమం వారే. దీంతో విద్యార్థులు రోజూ వచ్చి చదువు లేకుండానే వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమీప ఉర్దూ పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయురాలిని, తాండూరు నుంచి మరో ఉపాధ్యాయుడిని పంపించేందుకు చర్యలు తీసుకుంటామని డీఈఓ వారికి హామీ ఇచ్చారు.

ఆ ఉపాధ్యాయుడు మాకొద్దు...

ప్రధానోపాధ్యాయుడు జైసింగ్‌కు విద్యార్థులను క్రమశిక్షణగా కూర్చోబెట్టడం, ఆంగ్లం బోధన చేయడం, గణితం చెప్పడం రాదట.. పాఠశాలకు వచ్చి హాజరు పట్టికలో సంతకం చేసి.. బయటకు వెళతారని ఆయన మాకొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కొద్దిసేపు పాఠశాలలో గందరగోళం నెలకొనడంతో డీఈఓ సముదాయించారు. బషీరాబాద్‌ మండలంలో కొందరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని, ఉదయం ఆలస్యంగా రావడం.. సాయంత్రం 3.30 గంటలకే రైలుకు వెళుతున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

భోజనం విషయంలో శుభ్రత తప్పని సరి...

గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. తరగతి గదులు, వంట గది, నిర్వాహకులు శుభ్రత పాటించి వంట చేయాలని.. కూరగాయలు, ఆహార పదార్థా.లు తాజాగా అందించాలని డీఈవో ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం బషీరాబాద్‌ బాలుర, కస్తూర్బా పాఠశాలలో పరిసరాలను పరిశీలించారు. వసతి గృహాల్లో నిబంధనలు పాటించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని