ఈసారీ ఓయూ గౌరవ డాక్టరేట్‌ లేనట్టే!
eenadu telugu news
Published : 23/10/2021 02:57 IST

ఈసారీ ఓయూ గౌరవ డాక్టరేట్‌ లేనట్టే!

27న వర్సిటీ 81వ స్నాతకోత్సవం

 

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ ఈసారీ ఎవరికీ ఇవ్వడం లేదు. ఈ పురస్కారం అందించేందుకు ఇప్పటివరకు ప్రముఖలెవర్నీ వర్సిటీ అధికారులు ఎంపిక చేయలేదు. ఓయూ 81వ స్నాతకోత్సవం ఈనెల 27న జరగనుంది. దీనికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, డీఆర్డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌రెడ్డి అతిథులుగా హాజరుకానున్నారు. స్నాతకోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలందించే ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయడం ఆనవాయితీ. రవీంద్రనాథ్‌ఠాగూర్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, బాబూరాజేంద్రప్రసాద్‌ వంటి ప్రముఖులు సహా ఇప్పటివరకు ఓయూ నుంచి 47 మంది ఈ పురస్కారాలు అందుకున్నారు. గతంలో ఓయూ తరఫున 2001లో ప్రముఖ డిజిటల్‌ టెక్నాలజీ ఇంజినీర్‌ డాక్టర్‌ అరుణ్‌ నేత్రావలికి గౌరవ డాక్టరేట్‌ అందించారు. తర్వాత రెండు దశాబ్దాలుగా ఎవరికీ ఆ పురస్కారం ఇవ్వలేదు. చివరిసారిగా ఓయూ స్నాతకోత్సవం 2019 జూన్‌ 17న జరిగింది. అప్పట్లో ఆరేళ్ల కాలానికి సంబంధించి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. 2018 జూన్‌ నుంచి గతేడాది జులై మధ్య చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు ఇవ్వనున్నారు. విశ్వవిద్యాలయ చరిత్రలో రెండు స్నాతకోత్సవాల నిర్వహణ బాధ్యతలు చూసిన వ్యక్తిగా ప్రస్తుత పరీక్షల విభాగం కంట్రోలర్‌ ప్రొ.శ్రీరామ్‌వెంకటేశ్‌ గుర్తింపు సాధించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని