చైనా తరహాలో స్వదేశీ మోసాలు!
eenadu telugu news
Published : 23/10/2021 02:10 IST

చైనా తరహాలో స్వదేశీ మోసాలు!

రుణ యాప్‌ల స్థానంలో పెట్టుబడి యాప్‌లు

5 నెలల వ్యవధిలో రూ.10 కోట్లు హాంఫట్‌

ఈనాడు, హైదరాబాద్‌

గతేడాది చైనా రుణ యాప్‌లు ఎంత దారుణానికి తెగించాయో తెలిసిందే.. అడిగిన వెంటనే అప్పులిస్తూ పెద్దఎత్తున వడ్డీలు గుంజారు. నిర్దేశించిన సమయానికి అసలు/వడ్డీ చెల్లించని ఖాతాదారుల నుంచి సొమ్ములు వసూలుకు అసభ్య పదజాలంతో మనో వేదనకు గురిచేశారు. బాధితుల ఫిర్యాదుతో నగర సైబర్‌ క్రైం పోలీసులు ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. చైనీయుల తరహాలో దిల్లీ ముఠాలు పెట్టుబడి యాప్‌(ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌) పేరుతో సరికొత్త మోసాలకు పాల్పడుతున్నాయి. లాభాల ఆశ చూపుతూ తమ వలలో పడిన వారి నుంచి కోట్లాది రూపాయలు కొట్టేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకూ సుమారు 60-70 మంది బాధితులు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో బాధితుడు రూ.2లక్షల నుంచి రూ.20లక్షల వరకూ పోగొట్టుకున్నారు. సగటున రూ.10 కోట్ల వరకు మాయగాళ్ల బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్టు పోలీసు అధికారులు స్పష్టంచేశారు.

కనిపించేది నిజమని నమ్మి..

ఈ తరహా మోసాల్లో వాట్సప్‌ నంబరుకు సందేశాలు వస్తాయి. ఇంటి వద్దే ఉంటూ రూ.లక్షలు సంపాదించవచ్చని, పార్ట్‌టైం ఉద్యోగంతో లాభాలు రాబట్టవచ్చనేది వాటిలోని సారాంశం. లింక్‌ను క్లిక్‌ చేయగానే యాప్‌ కనిపిస్తుంది. గృహిణులు, చిరుద్యోగులు, విద్యార్థులు, వయోధికులు ఇంట్లో నుంచే ఆదాయం సమకూరుతుందనే మాటలతో.. వారిని నమ్ముతున్నారు. ఖాతాదారుల నుంచి తొలిసారి రూ.200-500 జమ కాగానే 50-100 వరకు టాస్క్‌లిచ్చి మరుసటి రోజు రూ.300-600 వరకు లాభపడినట్టు వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. పెద్దమొత్తంలో పెట్టుబడితో మరింత రాబడి వస్తుందనే ఆశ రేకేత్తిస్తారు. డబ్బు జమ చేయగానే లాభాలు వచ్చినట్టుగా ఖాతాల్లోని నగదు నిల్వను పెద్దఎత్తున చూపుతున్నారు. దాన్ని దక్కించుకునేందుకు మరికొంత నగదు చెల్లించాలనే షరతుతో రూ.2,00,000- 20,00,000 వరకు గుంజుతున్నారు. డబ్బు మొత్తం పోగొట్టుకున్నాక బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు నగదు కొట్టేసేందుకు బ్యాంకు ఖాతాలకు బదులు యూపీఐ ఐడీను ఉపయోగించడంతో వారిని గుర్తించడం ఆలస్యమవుతోంది. చైనా రుణ యాప్‌ల్లో డైరెక్టర్లు/ఉద్యోగులుగా పనిచేసిన సిబ్బంది.. వాటికి అడ్డుకట్ట పడటంతో పెట్టుబడి యాప్‌లను రూపొందించి రూ.కోట్లు కొల్లగొడుతున్నట్టు సైబర్‌ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. వివిధ పేర్లతో సుమారు 1100కు పైగా యాప్‌లు మోసాలకు పాల్పడుతున్నట్టు అంచనా వేశారు.


ఆశపడి మోసపోవద్దు

తక్కువ పెట్టుబడితో భారీ లాభాలంటూ నమ్మిస్తారు. ఈ యాప్‌లు ప్లేస్టోర్‌లో కనిపించవు. పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని ఆశపడి పెట్టుబడులు ఉంచవద్ధు ఈ యాప్‌లన్నీ నకిలీవని గుర్తించాలి. దిల్లీ, హైదరాబాద్‌ల్లో మకాం వేసిన ముఠాలు కొత్త మోసాలకు పాల్పడుతున్నాయి.

-కె.వి.ఎం.ప్రసాద్‌, ఏసీపీ, హైదరాబాద్‌ సైబర్‌ క్రైం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని