కాలువల కబ్జా.. రాజకీయ దర్జా
eenadu telugu news
Published : 17/09/2021 02:34 IST

కాలువల కబ్జా.. రాజకీయ దర్జా

అమీన్‌పూర్‌లో నాలుగు కాలువల ఆక్రమణ

రంగంలోకి దిగిన హరిత ట్రైబ్యునల్‌


అమీన్‌పూర్‌లో ఆక్రమణలను పరిశీలిస్తున్న అధికారులు

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: గొలుసు కట్టు కాలువలు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ఒక చెరువు నిండితే కింది భాగంలోని మరో చెరువులోకి వర్షపు నీరు వెళ్లే కాలువలు నానాటికీ కనుమరుగవుతున్నాయి. వాటిని మాయం చేస్తూ బహుళ అంతస్తులు భవనాలు నిర్మిస్తున్నారు. అమీన్‌పూర్‌లో రూ.70 కోట్ల విలువైన 4 కాలువలు ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించారు. దీనిపై ప్రత్యక్ష విచారణ జరిపిన విధానంపై అందిస్తున్న కథనం.

అక్రమ మార్గం.. హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో అమీన్‌పూర్‌ పురపాలక పట్టణం ఉంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. గజం స్థలం రూ.60 వేలు ధర పలుకుతోంది. 150 గజాల్లో నిర్మించిన ఇంటిని కోటి 25 లక్షలకు అమ్ముతున్నారు. జాతీయ రహదారి, మరోవైపు అవుటర్‌ రింగురోడ్డు ఉండటంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు నేరుగా ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు అక్రమాల మార్గం పట్టారు. అమీన్‌పూర్‌ పెద్దచెరువు, కొత్తచెరువు, బంధంకొమ్ము చెరువుల మధ్య ఉన్న గొలుసు కట్టు కాలువలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. నాలుగు కాలువల మీదుగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేందుకు హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అధికారులు 11 రకాల వివిధ సర్వే నంబర్లలో 9 వేల 914 చదరపు మీటర్లలో నాలుగు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకోవడానికి నేరుగా అనుమతులివ్వడం చర్చనీయాంశంగా మారింది.

అధికారుల పాత్ర.. కాలువల ఆక్రమణల విషయంలో నీటిపారుదల శాఖ అధికారులు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. చెరువుల పై భాగంలో నిరభ్యంతర పత్రాలు జారీ చేసి హెచ్‌ఎండీఏ నుంచి చెరువుల్లో అనుమతులు పొందడానికి అవకాశం కల్పించినట్టు విచారణలో తేలింది.

తీగ లాగితే...

కాలువల్లో మట్టిపోసి పూడ్చిన అనంతరం.. వర్షం కురిసిన సందర్భంలో కింది భాగంలోని కృష్ణా బృందావనం, గ్రీన్‌హోమ్స్‌ కాలనీలు నీట మునిగాయి. దీనిపై అభ్యంతరాలు పెట్టినా స్థిరాస్తి వ్యాపారి పట్టించుకోలేదు. దీంతో రామచంద్రాపురం ఎంఐజీ కాలనీకి చెందిన మానవ హక్కులు వినియోగదారుల పరిరక్షణ సమితి ఛైర్మన్‌ ఠాకూర్‌ రాజ్‌ కుమార్‌సింగ్‌ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. 4 కాలువల ఆక్రమణలపై విచారణ చేసేందుకు జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్‌ను నియమించాలని గత నెల 27న ఆదేశించింది. ప్రత్యక్ష పరిశీలన చేసి ఈ నెల 30న పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ట్రైబ్యునల్‌ కోరింది. జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు పర్యవేక్షణలో కమిటీ వేశారు. మూడు సార్లు కాలువల ఆక్రమించిన ప్రాంతాలను సందర్శించారు. వర్షపు నీటి ప్రవాహానికి అడ్డుగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జరిగాయని గుర్తించారు. బంధం కొమ్ము చెరువు పరివాహక ప్రాంతంలో జరిగిన నిర్మాణాలను గతంలో అధికారులు కూల్చి వేశారు. దానిపై స్థిరాస్తి వ్యాపారి కోర్టును ఆశ్రయించారు. దానికి కోర్టు స్టేటస్‌కో ఆర్డర్‌ ఇచ్చింది. దాన్ని ధిక్కరించి నిర్మాణాలు జరిగినట్టు అధికారుల విచారణలో తేలింది. దీంతో స్థిరాస్తి వ్యాపారిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు.

సౌధాలైనా కూల్చేస్తాం

-హనుమంతరావు, కలెక్టర్‌

మూడు చెరువుల మధ్య గొలుసు కట్టు కాలువలు ఆక్రమించి సౌధాలు నిర్మించినా కూలుస్తాం. మున్సిపల్‌, నీటిపారుదల శాఖ అధికారుల పాత్రపైనా విచారణ జరుపుతున్నాం. ఇప్పటికే పలు చర్యలకు శ్రీకారం చుట్టాం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని