ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి దుర్మరణం
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి దుర్మరణం

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజిపురం గ్రామం వద్ద గురువారం ప్రమాదవశాత్తు కారు, ఆర్టీసీ బస్సును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌కు చెందిన సింగారి వెంకటేశ్‌(38), చిలువేరు యాదయ్య(41) సెంట్రింగ్‌ పని చేస్తుంటారు. అమీర్‌పేటకు చెందిన మరో ఇద్దరు కార్మికులు జోగినాయుడు, దానయ్యతో కలిసి వారిద్దరు వలిగొండ మండలం అర్రూర్‌ గ్రామంలో ఓ ఇంటి స్లాబ్‌ వేసేందుకు ఉదయం కారులో అరూర్‌ గ్రామానికి బయలు దేరారు. అనాజిపురం శివారులో గల తిరుమలకాంటా సమీపంలో మలుపు తిరుగుతుండగా ఎదురుగా వస్తున్న నల్గొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా వెంకటేశ్‌, యాదయ్య మార్గమధ్యలో మృతి చెందారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వెంకటేశ్‌కు భార్య వసంత, కూతురు, కొడుకు, యాదయ్యకు భార్య లక్ష్మి, కొడుకు, కూతురు ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని