పాప భీతి..!
eenadu telugu news
Updated : 17/09/2021 10:37 IST

పాప భీతి..!

 నగరంలో నిర్భయంగా తిరిగి ఆనక ఆత్మహత్య చేసుకున్న రాజు 

3 వేల సీసీ కెమెరాలను పరిశీలించి 2 వేల మందిని విచారించిన పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌

మృతుడు రాజు

సైదాబాద్‌లో చిన్నారిని హత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు రాజును అరెస్టు చేయడంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పోలీసులు ఆ తర్వాత బుర్రలకు పదును పెట్టారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మూడు రోజుల తరువాత ప్రయత్నాలు మొదలుపెట్టారు. శాస్త్రీయ ఆధారాలు... తార్కిక ఆలోచనలు... నేరస్థుల మనస్తత్వం... తప్పించుకుని పారిపోయే హంతకుల ప్రవర్తనల ఆధారంగా విశ్లేషించారు. ఘటన జరిగిన రెండో రోజుకు కొన్ని ఆధారాలు లభించడంతో ఓ ప్రణాళికను రూపొందించారు. పారిపోతే కచ్చితంగా నిందితుడు సొంతూరు నల్గొండ జిల్లా కనకొండ్లకు వెళ్తాడని, లేదంటే హైదరాబాద్‌ నుంచి కనకండ్ల మధ్య 9 ప్రాంతాల్లో కనిపిస్తాడన్న అంచనాతో ఆయా ప్రాంతాల్లో నిఘా ఉంచారు. కష్టపడి దాదాపు కనుక్కున్నామనుకొనే లోపే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఫొటోల సేకరణ

ఘటన జరిగిన సింగరేణి కాలనీ వాసుల అనుమానం మేరకు రాజు ఇంట్లో గాలించారు. ఓ మూలన చరవాణిని గుర్తించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ఫొటోను తీసుకున్నారు. 

* నల్గొండ జిల్లాలోని అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోవాలంటూ అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొద్ది నెలల కిందట నిందితుడు తీసుకున్న ఫొటోలను సేకరించారు.

* ఈనెల 12 ఉప్పల్‌ నుంచి బోడుప్పల్‌ మీదుగా ఘట్‌కేసర్‌, నారపల్లి, శివారెడ్డిగూడ, అవుషాపూర్‌లలో గాలించారు.

* హైదరాబాద్‌-కొనకొండ్ల మధ్య ఉన్న గ్రామాలకు ఈనెల 13న వెళ్లి ఆరా తీశారు. అతడి కుటుంబ సభ్యులు ఊరు వదిలివెళ్లిపోయినా.. అతను అప్పుడప్పుడు సొంతూరు వస్తుంటాడని తెలుసుకున్నారు.

* ఈనెల 14న భువనగిరి సమీప గ్రామాల్లో పోలీసులతో కలిసి వెతికారు. అతడి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌, పాలకుర్తిలలో బంధువులుండేవారని చెప్పారు. అక్కడ బుధవారం ఉదయం గాలింపు చేపట్టారు. గురువారం తెల్లవారుజాము వరకూ పాలకుర్తి, స్టేషన్‌ ఘన్‌పూర్‌లలో వాకబు చేశారు. ఉదయం 9.58 గంటలప్పుడు రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.


శాంతించిన కాలనీ

నిందితుడి ఇంటిని కూల్చిన దృశ్యం

సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌, న్యూస్‌టుడే: ఆరేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన ఘటనపై వారం రోజులుగా ఉద్రిక్తతలకు నిలయంగా మారిన బాధిత బాలిక నివసిస్తున్న గుడిసెల ప్రాంతం.. నిందితుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత గురువారం సాయంత్రం ప్రశాంతంగా కనిపించింది.


బస్తీలో బాణసంచా కాలుస్తున్న మహిళలు

తొలుత నమ్మలేదు: నిందితుడు పల్లకొండ రాజు(27) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందుకున్న బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు తొలుత నమ్మలేదు. కొందరు మృతుడి చేతిపై మౌనిక పచ్చబొట్టును, ముఖం వీడియోలను చూపడంతో వారు శాంతించారు. బహిరంగంగా ఎన్‌కౌంటర్‌ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 

షర్మిల దీక్ష శిబిరం తొలగింపు.. ముఖ్యమంత్రి స్పందన డిమాండ్‌ చేస్తూ బాధిత బాలిక కుటుంబం ఇంటి సమీపంలో దీక్షకు దిగిన వైఎస్‌ఆర్‌టీపీ అధినేత షర్మిల, ఆమె అనుచరుల శిబిరాన్ని బుధవారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల ప్రాంతంలో బలవంతంగా తొలగించారు. 

స్థానికుల ఆందోళన: ఎటువంటి సమాచారం లేకుండా మంత్రులు వచ్చి వెళ్లారని ఆరోపిస్తూ బస్తీ వాసులు ఆందోళనకు దిగారు. కొందరు గురువారం నిందితుడు రాజు ఇంటిని నేలమట్టం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు కాలనీలో ర్యాలీ నిర్వహించి, బాణసంచా కాల్చారు.

ఆడపిల్లలకు రక్షణ కరవు: విజయశాంతి

బాధిత కుటుంబాన్ని గురువారం మధ్యాహ్నం భాజపా నాయకురాలు విజయశాంతి పరామర్శించారు. చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చడం కష్టంగా ఉందన్నారు. తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ కరవైందని విమర్శించారు.


పట్టించుకోలేదు.. పట్టుకోలేదు!
పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
ఈనాడు - సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

నిందితుడు రాజు మత్తులో చిన్నారిపై హత్యాచారం చేసినా.. ఆ తరవాత మత్తువీడి నగరంలో మూడు రోజులు యథేచ్ఛగా తిరిగాడు. ఆ సమయంలో పోలీసులు కేసును పెద్దగా పట్టించుకోకపోవడం అతను నగరం వీడివెళ్లడానికి కలిసొచ్చింది. ఘటనపైన, పోలీసుల నిర్లక్ష్యంపైన పౌరసమాజం తీవ్రంగా స్పందించిన తరువాతే పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. సీసీ కెమెరాలు ఇతరత్రా సాంకేతిక ఆధారాలపై దృష్టిసారించారు. అప్పటికే నిందితుడు రాజధాని వీడాడు.
సైదాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈనెల 9వ తేదీ ఆరేళ్ల చిన్నారిపై నిందితుడు రాజు ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి 7 గంటలప్పుడు చిన్నారి తల్లిదండ్రులు సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా 9 గంటల తర్వాత పోలీసుల ఘటనా స్థలానికి వచ్చారు. రాజు ఇంటిలో వెతకాలని చెప్పినా పట్టించుకోని పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలనలో నిమగ్నమయ్యారు. కాలనీవాసుల ఒత్తిడి మేరకు అర్ధరాత్రి తర్వాత ఇంటి తాళాన్ని పగలగొట్టించి చూశారు. చిన్నారి హత్యకు గురై కన్పించింది.

డీజీపీ స్పందించిన తర్వాతే..

9వ తేదీ ఘటన జరిగినా 12వ తేదీ వరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడంతో పోలీసుల తీరును రాజకీయపార్టీలు, పౌరసమాజం ఎండగట్టాయి. డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశాకే పోలీసులు నిర్లక్ష్యం వీడారు .


పారిపోయేందుకు ఆటో చోరీచేద్దామనుకున్నా..

ఈనాడు, హైదరాబాద్‌: నిందితుడు రాజు ఎల్బీనగర్‌లో ఓ ఆటోను దొంగిలించి అందులోనే పారిపోవాలని భావించాడు. టీ తాగేందుకు వెళ్లిన ఆటో యజమాని రావడంతో పథకం పారలేదని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈనెల 11న రాజు పోలికలతో ఉన్న ఓ వ్యక్తి ఆటోలో వెనుక భాగంలో కూర్చున్నట్లు గుర్తించారు. యజమాని లేకపోవడంతో ముందుకొచ్చి ఆటోను స్టార్ట్‌ చేసేందుకు యత్నించినట్లు కనిపించింది. అది చూసిన యజమాని అక్కడికొచ్చి ఏం చేస్తున్నావంటూ నిలదీసి రాజు దగ్గరున్న సంచిని పరిశీలించాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆటో యజమానిపై దాడి చేసేందుకు యత్నించగా పక్కనున్న ఆటోడ్రైవర్లు, స్థానికులు అడ్డుకున్నారు. ఇద్దర్నీ సముదాయించి పంపించేశారు. ఆ తర్వాత నిందితుడు ప్రధాన చౌరస్తాలోని ఓ హోటల్‌వైపు వెళ్లి అక్కడ బస్సు ఎక్కాడు. బండి నంబర్‌ ఆధారంగా ఆ ఆటో డ్రైవర్‌ను గుర్తించి.. మరిన్ని వివరాలు సేకరించారు. రాజు గురించి ఎవరికీ అవగాహన లేకపోవడంతో తప్పించుకున్నాడని, లేదంటే అదే రోజు చిక్కేవాడని పోలీసులు పేర్కొంటున్నారు. గతంలో నిందితుడిపై చైతన్యపురి ఠాణాలో ఆటో చోరీ కేసు నమోదైందన్నారు.


ఆచూకీ తెలుస్తోందనగా ఆత్మహత్య
- అంజనీకుమార్‌, హైదరాబాద్‌ సీపీ 

హత్యాచార ఘటన జరిగిన రెండో రోజు నుంచే నిందితుడు రాజు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం. కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు సమీక్షించాం. వేల సంఖ్యలో సీసీ కెమెరాలను పరిశీలించి, శాస్త్రీయంగా పరిశోధించి ఒక్కో ఆధారాన్ని సేకరిస్తూ నిందితుడి ఆచూకీ దాదాపు తెలుసుకొనేవరకూ వెళ్లాం. ఈ లోపే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది.


సీసీ కెమెరాల పరిశీలన క్రమమిది

ఈనాడు, హైదరాబాద్‌: రాజును పట్టుకొనేందుకు సుమారు 3 వేల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, 2 వేల మందిని విచారించారు. సంతోష్‌నగర్‌ లేబర్‌ అడ్డాకు వెళ్తాడన్న సమాచారంతో ఎల్బీనగర్‌, చాంద్రాయణగుట్ట, మిధాని, మలక్‌పేట్‌ మార్గాల్లో ప్రధాన రహదారులు, ప్రైవేటు ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

* సంతోష్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వైపు, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, ఎల్బీనగర్‌లలోని వెయ్యికి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా రాజు, అతడితోపాటు మరో వ్యక్తి కనిపించాడు.

* ఎల్బీనగర్‌ నుంచి వనస్థలిపురం, ఉప్పల్‌ వైపు ఉన్న 800 సీసీ కెమెరాల ఫుటేజీలను చూశారు. నాగోల్‌, ఉప్పల్‌ రహదారిపై తొమ్మిది కెమెరాల్లో కనిపించడంతో పరిశోధన ఉప్పల్‌ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.

* బోడుప్పల్‌ వరకూ మరో 1200 కెమెరాలను పరిశీలించారు. ఒకట్రెండు చోట్ల నిందితుడి అస్పష్ట దృశ్యాలుండడంతో ఘట్‌కేసర్‌ వైపు దృష్టిసారించారు.


రాజు.. గంజాయి ఉందా?

గంజాయి కావాలి.. తెచ్చిస్తావా..?
సర్‌.. ఫలానా దగ్గర రాజు కనిపించాడు. అరెస్ట్‌ చేస్తారా..? రూ.10 లక్షల రివార్డు నాకే ఇస్తారా..?
సర్‌.. ఇప్పుడే చూశా.. పట్టుకునేలోపే మాయమయ్యాడు. ఆ డబ్బు ఇచ్చేస్తారా..?

నిందితుడి ఆచూకీ చెబుతారని పోలీసులు నంబర్లు ప్రకటిస్తే.. వాటికి వచ్చిన ఫోన్‌కాల్స్‌ ఇలా ఉన్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 వేల కాల్స్‌ వచ్చాయి. వీటిలో దాదాపు అన్నీ ఉత్తుత్తివే కావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. రాజు గురించి సమాచారం తెలిస్తే 94906 16366, 94906 16627 నంబర్లకు కాల్‌ చేయాలని పోలీసులు సూచించారు. రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. కొందరు ఈ ఫోన్‌ నంబర్లు నిందితుడివే అనుకొని తిట్లదండకం అందుకున్నారు. మరికొందరేమో గంజాయి ఉందా అని అడిగారు. మొదట్లో ప్రతి కాల్‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. తర్వాత నమ్మదగిన సమాచారం అనిపిస్తేనే రంగంలోకి దిగారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని