ఆస్తి పన్ను మదింపు ఇక సులభం
eenadu telugu news
Published : 17/09/2021 00:34 IST

ఆస్తి పన్ను మదింపు ఇక సులభం

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ: తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ పట్టణాలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. ఈ సందర్భంగా కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నాయి. పాత భవనాలను కొత్తగా మార్చటం, ఒకే అంతస్తు ఉన్న గృహాలను రెండు మూడు అంతస్తులుగా నిర్మించడం వంటివి చేస్తున్నారు. ప్రధాన రోడ్ల్లపైన ఉన్న గృహాలను తొలగించి వాటిని వాణిజ్య, వ్యాపారాలకు పనికి వచ్చే విధంగా దుకాణాలు నిర్మిస్తున్నారు. ఇటువంటి వారికి ఇక నుంచి  అధికారులు పన్ను ఎంత వేస్తారో అన్న భయం లేదు. పురపాలక పరిపాలనా విభాగం సెక్షన్‌ 94 చట్టం 2019 ప్రకారం నిర్మాణదారులే మదింపు చేసుకునే వీలుంది.
ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాలి: కొత్తగా భవనాలు, గృహాలు నిర్మించిన వారు ముందుగా సీడీఎంఏ.తెలంగాణ.జీవోవీ.ఇన్‌ లోకి లాగిన్‌ కావాలి. ఆస్తి పన్ను అంచనాను క్లిక్‌ చేయాలి. ఇందులో పేర్కొన్న విధంగా వివరాలను సబ్‌మిట్‌ చేయాలి. నిర్మాణం ఏరియా, నిర్మించిన ప్లాన్‌, అడ్రస్‌, ప్రాంతం పురపాలక సంఘం తదితర వివరాలను ఆప్‌లోడ్‌ చేయాలి. చరవాణి నంబరును ఎంటర్‌ చేయాలి. అనంతరం ఓటీపీ నంబర్‌ ఎంటర్‌ చేశాక, పేరు, తండ్రి పేరు, ప్రాంతం, బ్లాక్‌, నిర్మించిన ఇరు వైపులా ఉన్న వారికి సంబంధించిన వివరాలను అప్‌లోడ్‌ చేయాలని కోరుతుంది. వీటిని నిక్షిప్తం చేశాక, భవన నిర్మాణ అనుమతి పత్రం తదితర వివరాలను సబ్‌మిట్‌ చేయాలి. ఆస్తి పన్ను అంచనా వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చిన 15 రోజుల్లో పురపాలక సంఘం అధికారులు తగిన సమాచారాన్ని పంపిస్తారు.
కమిషనర్‌ పరిశీలించాక: భవన నిర్మాణ పన్ను మదింపునకు సంబంధించిన వివరాలను గృహ నిర్మాణదారుడు అప్‌లోడ్‌ చేశాక, వివరాలు కమిషనర్‌ లాగిన్‌కు వెళుతుంది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలింయాక సమాచారం అందజేస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉంటే ఇంటి నంబరును కేటాయిస్తారు.
తప్పుగా నమోదుచేస్తే జరిమానా: ఆస్తి పన్ను అంచనాలో గృహా యజమాని తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే 25 రేట్లు అధికంగా జరిమానా విధిస్తారు. ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేసి తక్కువ చూపెట్టడం, అనుమతి పత్రంలో పేర్కొన్న విధంగా నిర్మాణం చేయకపోవడం. ఒకే అంతస్తు నిర్మాణానికి అనుమతి తీసుకోని రెండు నిర్మించటం వంటి చేస్తే జరిమానా తప్పదు.
సిబ్బందికి పని భారం తగ్గుతుంది
శరత్‌చంద్ర, కమిషనర్‌, పురపాలక సంఘం వికారాబాద్‌

కొత్తగా నిర్మాణాలకు గృహ యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి అవకాశం తమకు తాముగా ముందుకు వచ్చి తమ స్థలంలో ఈ విధంగా నిర్మించామని చెప్పి ఆస్తి పన్నును లెక్కల ప్రకారంగా విధించాలని కోరటం వల్ల సిబ్బందికి పని భారం తగ్గుతుంది. ఈ పద్ధతిని దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని