
కిషన్‌రెడ్డి పాదయాత్రతో స్తంభించిన ట్రాఫిక్
అంబర్‌పేట: అంబర్‌పేట పై వంతెన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్న ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గురువారం పాదయాత్ర చేపట్టారు. ఫ్లైఓర్ నిర్మాణానికి ప్రతిపాదించిన గోల్నాక చర్చి నుంచి ఆరో నంబర్ చౌరస్తా, శ్రీరమణ చౌరస్తాల మీదుగా ముత్యాలమ్మ ఆలయం వరకు పాద యాత్ర చేశారు. అనంతరం ఆయా విభాగాల ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అంబర్‌పేట ఫ్లైఓవర్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు లైన్లు, స్తంభాలు, డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్‌ను పక్కకు తొలగించాలన్నారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యలను త్వరితగతిన చేపట్టి పైవంతెన నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో రీజినల్ రింగ్‌రోడ్డును మంజూరు చేయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి భూ సేకరణ కోసం కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. 14 జిల్లాలతో అనుసంధానం కలిగి ఉండే రీజినల్ రింగురోడ్డు నిర్మాణం పూర్తైతే ఐటీ, ఫార్మా తదితర పరిశ్రమల ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పాదయాత్రతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కొవిడ్ నిబంధనలు పాటించకుండా భాజపా కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు.