
నిబంధనలు అతిక్రమించిన ఫంక్షన్ హాళ్లపై కొరడా
సికింద్రాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో నిబంధనలు అతిక్రమిస్తున్న ఫంక్షన్ హాళ్ల యజమాన్యాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సికింద్రాబాద్ పరిధిలోని నాలుగు ఫంక్షన్ హాళ్లను అధికారులు సీజ్ చేశారు. పారిశుద్ధ్య నివారణ చర్యలు సరిగ్గా చేపట్టనందు వల్లే ఈ చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొన్నారు. ఫంక్షన్ హాళ్లలో శుభకార్యాల అనంతరం చెత్తాచెదారాన్ని ఓ నిర్దిష్టమైన ప్రదేశంలో ఉంచి అక్కడి నుంచి తరలించాల్సిన యజమాన్యాలు అలా చేయకుండా సంచుల్లో మూట కట్టి నాలాల్లో వేస్తున్నారని పలువురు స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదు చేశారు. తద్వారా ఆ వ్యర్థాలు కల్వర్టుల్లో జామై వరద ప్రవాహానికి ఆటకం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంపీ సికింద్రాబాద్ సర్కిల్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. చిలకలగూడా పరిధిలోని నాలుగు ఫంక్షన్ హాళ్లను మూసివేశారు. అనంతరం ప్రొక్లెయిన్‌తో కల్వర్టుల్లోని చెత్తను తొలగించే ప్రయత్నం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే మిగిలిన వాటిపై కూడా ఇటువంటి చర్యలు తీసుకుంటామని సికింద్రాబాద్ సర్కిల్ డీసీ మోహన్‌రెడ్డి యజమాన్యాలను హెచ్చరించారు.