జ్వర..జాగ్రత్తండోయ్‌!
eenadu telugu news
Published : 17/09/2021 06:42 IST

జ్వర..జాగ్రత్తండోయ్‌!

వణుకు పుట్టిస్తున్న డెంగీ, మలేరియా

ముసురుతున్న వ్యాధులతో గజగజ

మసక వీడితేనే.. మశక దాడికి తెర

ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, మసీదు సెంటర్‌, కంబాలచెరువు, తుని, రంపచోడవరం

రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో జ్వర పీడితుల వార్డులో రోగులు

జిల్లాను రెండేళ్లుగా కొవిడ్‌ మహమ్మారి వణికిస్తుంటే.. కాలానుగుణ వ్యాధులు ఎప్పటిలాగే గుబులు రేపుతున్నాయి. మునుపటితో పోలిస్తే మలేరియా తగ్గుముఖం పట్టినా.. డెంగీ కలవరపెడుతోంది. అధ్వాన పారిశుద్ధ్యం, నిల్వ మురుగు- వర్షపు నీరు.. దోమలకు నిలయాలుగా మారుతుంటే.. ప్రజల్లో చైతన్యం- క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం ప్రాణాల మీదకు తెస్తోంది.

కాసులు మింగేస్తోంది..

తునిలో ఎం.ఆర్‌.పేట ప్రాంత బాలికకు (11) డెంగీ సోకితే విశాఖలో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పాప ఆరోగ్యం కుదుటపడేసరికి రూ.50 వేలు ఖర్చయింది.

రాజమహేంద్రవరంలో సీతంపేటకు చెందిన రాజుకు ఇటీవల జ్వరం, జలుబు వచ్చింది. ఆరోగ్యం కుదుట పడక డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, ఇతర పరీక్షలు చేయించారు. వీటికి రూ.5 వేలైంది. ఏమీ లేదని తేలినా ఎందుకైనా మంచిదని మరో రూ.వెయ్యి మందులు రాసిచ్చారు. చేసేదిలేక ఆ మందులూ కొనుక్కోవాల్సి వచ్చింది.

తునిలోని సాయినగర్‌లో...

తీవ్రత ఇక్కడే..

మలేరియా తీవ్రత మన్యంలో 10 మండలాల్లో ఉంటే.. ఎటపాక డివిజన్‌లో అత్యధికంగా 54, రంపచోడవరం డివిజన్‌లో 29 కేసులు ఉన్నాయి. ● డెంగీ కేసుల జాడ కాకినాడ, పెద్దాపురం డివిజన్లలో ఎక్కువుంది. రంపచోడవరం డివిజన్‌లో డెంగీ కేసులు రావడం కలవరపెడుతోంది. ● కాకినాడ నగరంలో25పైనే కేసులు నమోదవగా సామర్లకోట, తుని, పెద్దాపురం మున్సిపాలిటీలు, ఏలేశ్వరం నగర పంచాయతీలోనూ కేసులు వచ్చాయి. ● కాకినాడ జీజీహెచ్‌లో ఈ ఏడాది ఇప్పటికి 1,958 మందికి డెంగీ పరీక్షలు చేస్తే.. 226 మందికి పాజిటివ్‌ తేలింది. బాధితుల్లో నలుగురు మృత్యువాత పడ్డారు.

జీజీహెచ్‌లో డెంగీ బాధితుల వివరాల నమోదు

ప్రాణాలు తోడేసింది..

సీతానగరం: సీతానగరానికి చెందిన ఆరోతరగతి విద్యార్థి పట్టపు మోహన్‌ దుర్గాప్రసాద్‌ ఈనెల 14న మృత్యువాత పడ్డాడు. 11న కుటుంబీకులు ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. డెంగీ అని తేల్చిన వైద్యులు మందులు ఇచ్చారు. మూడు రోజుల్లోనే బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించింది. మంగళవారం అర్ధరాత్రి అపస్మారకస్థితికి చేరుకోవడంతో రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కుటుంబాన్ని కుదిపేసింది.. 

సర్పవరంవాసిసత్తిబాబు కూలీ. నాలుగు రోజుల కిందట జ్వరంతో ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించారు. ప్లేట్‌లెట్లు 70 వేలు ఉన్నాయని చెప్పడంతో స్థోమతలేక బుధవారం జీజీహెచ్‌లో చేరారు. వాళ్ల ఇంట్లోనే బావ లక్ష్మణ్‌కు డెంగీ సోకింది. అయిదు రోజులు ప్రైవేటు ఆసుపత్రిలో ఉంటే రూ.50 వేలైంది.వీరి చిన్నమ్మ పార్వతికి 20 రోజుల కిందట డెంగీ వస్తే.. గుర్తించలేక సాధారణ మాత్రలు వేసుకుని ఇంట్లో ఉన్నారు. పరిస్థితి విషమించగా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి.. రూ.లక్ష ఖర్చు చేసినా ప్రాణం నిలవలేదు.

పంచ సూత్రాలతో ఫలితం●

పారిశుద్ధ్యం: పారిశుద్ధ్యం మెరుగుకు.. ప్రత్యేక డ్రైవ్‌ అవసరం. వందల సంఖ్యలో ఖాళీ స్థలాల్లో పొదలు పెరిగి, వాన నీరు నిలిచి దోమలు పెరుగుతున్నాయి. నిత్యం టన్నుల్లో పోగయ్యే వ్యర్థాల నిర్వహణ కొరవడింది. గంబూషియా చేపలు వదలడం, ఫాగింగ్‌, పిచికారీ చేయాలి.

పరీక్షలు: కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని, రామచంద్రపురంలలో డెంగీ నిర్ధారణ జరుగుతున్నాయి. జిల్లా లోని అన్ని నమూనాలు ఇక్కడకు తెచ్చి పరీక్షించి ఫలితాల వెల్లడించడంలో జాప్యం జరుగుతోంది. ఆసుపత్రుల్లో పరీక్షల సామర్థ్యం పెంచి ఫలితాలు తేల్చాలి.

వైద్యశిబిరాలు: కేసుల తీవ్రత గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు పెట్టాలి.ఇంటింటి ఫీవర్‌ సర్వే ద్వారా బాధితులను గుర్తించాలి.

మందులు: కీలక వైద్యశాలలను మందుల కొరత వేధిస్తోంది. జిల్లావ్యాప్త ఆసుపత్రుల్లో అవసరమైన మందులు చెంతనే ఉంచాలి.

చైతన్యం: ప్రతి శుక్రవారం ‘ఫ్రై డే- డ్రై డే’ ద్వారా నీటి నిల్వ ప్రాంతాలు గుర్తించి స్థానికులను, స్థానిక సంస్థల్లో పారిశుద్ధ్య విభాగాలు, ఇతర అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. దీనిని మరింత సమర్థంగా అమలు చేయాలి.

ప్రణాళికతో చక్కదిద్దుతాం..

కాకినాడ, పెద్దాపురం పరిధిలో డెంగీ ఎక్కువగా ఉంది. అయిదు చోట్ల పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం డీహెచ్‌లో ప్లేట్‌లెట్‌ నిల్వ కేంద్రాలు పెట్టాం. లార్వా నివారణ చర్యలు చేపడుతూనే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ప్రణాళిక, కార్యాచరణతో చక్కదిద్దుతాం. - గౌరీశ్వరరావు, డీఎంహెచ్‌వో

ఇదీ ముసురుతున్న వ్యాధుల లెక్క.. (జనవరి నుంచి సెప్టెంబరు 15 వరకు) ● మలేరియా పీడితులు - 83 ● జ్వర బాధితులు - 4,64,062


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని