రబీలో ప్రత్యామ్నాయ పంటల సాగు మేలు
eenadu telugu news
Published : 17/09/2021 06:30 IST

రబీలో ప్రత్యామ్నాయ పంటల సాగు మేలు


విజయకుమార్‌, జేడీఏ

 

పి.గన్నవరం, న్యూస్‌టుడే: వచ్చే రబీలో జిల్లాలో బొండాలు రకమైన ఎం.టి.యు.3626 రకం రైతులు సాగుచేయకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నట్లు జేడీఏ నందిగం విజయకుమార్‌ గురువారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. బాయిల్డ్‌ రకమైన దీనికి కేరళలో మార్కెట్‌ తగ్గిపోయిందన్నారు. కేరళలో మార్కెట్‌ ఉంటుందన్న అంచనాతో జిల్లాలో రైతులు 50 శాతం విస్తీర్ణంలో బొండాలు రకం సాగుచేస్తున్నారన్నారు. తీరా పండించిన తరువాత మార్కెట్‌ లేకపోవడం, ఎఫ్‌.సి.ఐ. కొనుగోలు చేయకపోవడం వంటి పరిస్థితుల మధ్య రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. వచ్చే రబీ నుంచి ఈ రకం వరిని అసలు సాగుచేయకుండా ఈ ఖరీఫ్‌ నుంచే జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రబీలో బొండాల రకం వేసేందుకు విత్తనాల కోసం ఖరీఫ్‌లో జిల్లాలో అయిదు నుంచి 10 శాతం విస్తీర్ణంలో వేస్తున్నారని ఆయన వివరించారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో రైతులు అసలు బొండాలురకం వేయకుండా వారిలో చైతన్యం తీసుకొచ్చామన్నారు. బొండాలుకు ప్రత్యామ్నాయంగా ఎం.టి.యు.1121 రకం వేసుకునే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. ఇది సూపర్‌ఫైన్‌ రకంగా గుర్తింపు పొందిందన్నారు.

ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నాం..

ఏటా రబీలో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్న క్రమంలో వచ్చే రబీ నుంచి సాగునీరందని ప్రాంతాల్లో రైతులు ప్రత్యామ్నాయపంటలు సాగుచేసేలా కార్యాచరణ చేస్తున్నామని జేడీఏ నందిగం విజయకుమార్‌ వెల్లడించారు. సాగునీరు తక్కువగా ఉన్నప్పటికీ రబీలో పూర్తి ఆయకట్టుకు అనుమతులు ఇస్తున్నారని ఆయన అన్నారు. తీరా పంట చివరిదశకు వచ్చేసరికి కాలువల శివారు భూములు, మెరక భూములకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రానున్న రబీ నుంచి ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా జిల్లాలో కాలువల శివారు ఆయకట్టు, మెరకచేల వివరాలను ఇప్పటి నుంచే సేకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మధ్యడెల్టా, తూర్పుడెల్టాల్లో సుమారు 50వేల ఎకరాల ఆయకట్టులో ఈ తరహా భూములు ఉన్నాయన్నారు. ఈ భూముల్లో రైతులు అపరాలు వంటివి సాగుచేసేలా ప్రోత్సహిస్తామన్నారు. ఎప్పుడూ వరిసాగు కాకుండా పంటలను మార్చడం ద్వారా భూసారం పెరుగుతుందని ఆయన చెప్పారు. జలవనరులశాఖ ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి వ్యవసాయశాఖ అధికారులు మండలాలవారీ రబీలో నీరందని మెరక, కాలువల శివారు ఆయకట్టు వివరాలను సేకరిస్తారన్నారు. ఈ అంశాల గురించి వ్యవసాయశాఖమంత్రి కురసాల కన్నబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని