19న.. లెక్క తేలుద్ది 
eenadu telugu news
Published : 17/09/2021 06:30 IST

19న.. లెక్క తేలుద్ది 


స్ట్రాంగ్‌రూమ్‌లో బ్యాలెట్‌ పెట్టెలు

 

ఈనాడు - కాకినాడ, న్యూస్‌టుడే - అమలాపురం: ప్రాదేశిక ఎన్నికలపై ఇన్నాళ్లూ నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పరిషత్తు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు న్యాయస్థానం తాజా తీర్పుతో మార్గం సుగమం అయింది. పలువురు అభ్యర్థులు ప్రచారం ముమ్మరంగా నిర్వహించి.. ఎన్నికల్లో అన్ని విధాలుగా కసరత్తు చేసి.. గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్నారు. మే 21నాటి ఎన్నికల రద్దు నిర్ణయం వీరిని నిరాశపరిచినా.. తాజాగా ఆ తీర్పును పక్కనపెట్టి... ఓట్ల లెక్కింపునకు న్యాయస్థానం పచ్చజెండా ఊపడం ఉత్సాహాన్ని నింపింది.

ఏకగ్రీవాలతో జోష్‌ మీదున్న వైకాపా ఇంతకు ముందు జరిగిన పంచాయతీ, పుర ఎన్నికల్లో జయకేతనం ఎగరేసిన విషయం తెలిసిందే. ఈ పరిషత్తు ఎన్నికల ఫలితాలపైనా ధీమాగా ఉంది. తెదేపా పరిషత్తు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నా.. కొందరు అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరితోపాటు జనసేన, భాజపా ఇతర పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు. ఏప్రిల్‌ 8న ఎన్నికల్లో 61 జడ్పీటీసీ స్థానాల్లో 235 మంది అభ్యర్థులు పోటీచేస్తే.. ఎన్నిక జరిగిన 999 ఎంపీటీసీ స్థానాల్లో 2,627 మంది అభ్యర్థులు నిలిచారు. వీరంతా తమ భవిత కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 32.54 లక్షల మంది ఓటర్ల తీర్పు తేలనుంది. బ్యాలెట్‌ పత్రాలు స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచిన యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు అప్పట్లోనే ఏర్పాట్లు చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత చిక్కులు వీడగా ఈనెల 19న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు.

ఫలితం ఎవరి పక్షాన..?

వాస్తవంగా ఏప్రిల్‌ 10న ఓట్ల లెక్కింపు జరగాలి. ఇక ఎలాంటి ఇబ్బంది లేదు.. అనుకునే క్రమంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ న్యాయస్థానం నిర్ణయంతో నిలిచిపోయింది. అసలు ఆ ఎన్నిక చెల్లుతుందా..? చెల్లదా..? అనే మీమాంస నెలకొంది. తాజా తీర్పుతో ఎట్టకేలకు అడ్డంకులన్నీ తొలగాయి.

జిల్లాలో 82 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. వీటిలో అత్యధిక స్థానాలు వైకాపా (77) మద్దతుదారులకు దక్కాయి. జనసేన, స్వతంత్ర రెండేసి చొప్పున.. తెదేపా మద్దతుదారుకు ఒక ప్రాదేశికం దక్కాయి. మిగిలిన 999 ఎంపీటీసీ స్థానాలతోపాటు.. 61 జడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 8న ఎన్నికలు జరిగాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని