కోపంగా చూశాడని ప్రాణమే తీసేశారు 
eenadu telugu news
Updated : 30/07/2021 06:37 IST

కోపంగా చూశాడని ప్రాణమే తీసేశారు 


యానాం పోలీసుల అదుపులో ఉన్న నిందితులు

యానాం: పూటుగా మద్యం సేవించిన అయిదుగురు వ్యక్తులు ఎలాంటి కారణం లేకుండానే మరో ఇద్దరిపై దాడి చేసి ఒకరిని హత్య చేయడం, మరొకరిని తీవ్రంగా గాయపరిచిన ఘటన యానాంలో గురువారం చోటు చేసుకుంది. యానాం సీఐ అరివు సెల్వం, కోస్టల్‌ సీఐ జి.శివగణేష్‌ అందించిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం, కొవ్వూరు పరిసర ప్రాంతాలకు చెందిన అయిదుగురు వ్యక్తులు యానాం వచ్చారు. బైపాస్‌ రోడ్డులోని ఓ మద్యం దుకాణంలో తాగి బయటకు వస్తున్న సమయంలో బిల్లు కౌంటర్‌ వద్ద ఐ.పోలవరం మండలం పెదమడి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీరు లంక రాజబాబు (25), కాశి శ్రీనివాసరావు బిల్లు చెల్లిస్తున్నారు. ఆ సమయంలో రాజబాబు తమ పక్కనున్న అయిదుగురి వంక కోపంగా చూశాడంటూ.. వారిద్దరితో తగువుపడ్డారు. అయిదుగురిలో ఒకరు తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో రాజబాబు అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. కత్తిపోట్లకు కాశి శ్రీనివాసరావు పొట్ట చీరుకుపోయింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. వారి కోసం మూడు బృందాలతో గాలిస్తున్నట్లు సీఐ అరివు సెల్వం తెలిపారు. తీవ్రంగా గాయపడిన కాశీ శ్రీనివాసరావును ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ తరలించారు. చనిపోయిన రాజబాబు అవివాహితుడని, తల్లి ఇతర ప్రాంతాల్లో ఉంటోందని సమీప బంధువు తెలిపాడు. మద్యం తాగే అలవాటు లేదని, బిర్యానీ తినడానికి వచ్చి ఇలా దుర్మరణం పాలయ్యాడంటూ విలపించాడు. ఈ ఘటనలో రాజోలుకు చెందిన కేదగిరి మణికంఠ, చింతా సత్యనారాయణలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పంపన చిన్నా (రాజోలు), రోహిత్‌ (తాళ్లపూడి, పశ్చిమగోదావరి), పాతూరి థియోఫిలస్‌ (కొవ్వూరు, పశ్చిమగోదావరి) కోసం గాలిస్తున్నామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని