30 ఏళ్లుగా మూత.. మారని రాత!
eenadu telugu news
Updated : 29/07/2021 12:35 IST

30 ఏళ్లుగా మూత.. మారని రాత!

సహకార నూలుమిల్లు భవితవ్యం తేలేనా?

మూతపడిన ఆంధ్రా సహకార నూలుమిల్లు

గుంతకల్లు, న్యూస్‌టుడే: ఆంధ్రా సహకార నూలుమిల్లు మూతపడి 30 ఏళ్లు కావస్తున్నా.. ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు, మిల్లు ఆస్తుల అమ్మకాలు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కావడం లేదు. దీంతో గుంతకల్లులోని మిల్లులో ఉన్న విలువైన యంత్రాలు పాడైపోతున్నాయి. ఆలనాపాలనా కరవై గదులు కూడా దెబ్బతింటున్నాయి. మిల్లుకు సంబంధించిన ఆస్తులను అమ్మే అధికారాన్ని ప్రభుత్వం జాయింట్‌ కలెక్టరుకు అప్పగించి పదేళ్లకుపైగా గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదు. నష్టాలు వస్తున్నాయనే కారణంతో 1991లో మిల్లును మూసేశారు. దీనిలో పనిచేసే 1260 మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఈ మిల్లుకు దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1951లో శంకుస్థాపన చేయగా.. అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు 1954లో ప్రారంభించారు.

ఉత్తర్వులు ఉన్నా.. లభించని పరిష్కారం

మిల్లుకు చెందిన ఆస్తులను టెండరు పద్ధతిలో విక్రయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2010 మే 27న ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉత్తర్వు పరిశ్రమలు, వాణిజ్య విభాగం ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రాజీవ్‌ ఆర్‌.ఆచార్య పేరుతో విడుదలయ్యాయి. ఈ ఉత్తర్వుల్లో కొన్ని నిబంధనలను పొందుపర్చారు. ఆ మేరకు.. మిల్లును కొన్నవారు మిల్లును తిరిగి ప్రారంభించి 400 నుంచి 500 మందికి ఉపాధి కల్పించాలి. 4, 5 ప్యాకేజీలుగా విభజించి అమ్మకాలు చేయాలి. అప్పులను తీర్చాలని పేర్కొన్నారు. ప్రభుత్వం 2012 ఫిబ్రవరి 28న మరో ఉత్తర్వును జారీచేసింది. మిల్లుకు చెందిన స్థలంలో 16 ఎకరాలను ఎకరా రూ.80 లక్షల వంతున హౌసింగ్‌ బోర్డుకు అమ్మాలని పేర్కొన్నారు. దీనికి హౌసింగ్‌ బోర్డు మిల్లుకు రూ.12.80 కోట్లను చెల్లించాలి. హౌసింగ్‌ బోర్డు మిల్లుకు రూ.6 కోట్లను అందజేసింది. రోడ్డుకు ఆనుకుని ఉన్న మిల్లు స్థలాలను స్వాధీనం చేయాలని హౌసింగ్‌ బోర్డు అధికారులు పేచీ పెట్టడంతో ప్రక్రియ ఆగిపోయింది.

నిర్ణయం తీసుకోవాల్సింది జేసీనే

ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు జరగాలన్నా, మిల్లుకు చెందిన ఆస్తులను అమ్మాలన్నా అధికారమంతా జిల్లా సంయుక్త కలెక్టరు చేతుల్లో ఉంది. జిల్లాకు వచ్చే జేసీలు మిల్లు విషయంలో నిర్ణయాలు తీసుకునే లోగానే బదిలీ అయి వెళుతుండటంతో సమస్య మళ్లీ మొదటికి వస్తోంది. ఇపుడున్న జేసీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని గుంతకల్లు వాసులు కోరుతున్నారు.

ఆస్తుల విలువ రూ.139 కోట్లు

మిల్లు స్థానిక ఆంధ్రాబ్యాంకు నుంచి గతంలో రూ.2 కోట్లను, ఇతరుల నుంచి రూ.8 కోట్లను రుణంగా తీసుకుంది. ఈ రుణాన్ని ఇంతవరకు చెల్లించలేదు. మొత్తం 60 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 24 ఎకరాల స్థలంలో మిల్లుకు చెందిన కార్మికులతో పాటు ఇతరులు ఇళ్లను నిర్మించుకున్నారు. మిగిలిన 36 ఎకరాలను అమ్మడానికి అవకాశం ఉంది. ఇక్కడ చదరపు గజం స్థలం విలువ రూ.8 వేల వరకు ఉంది. మొత్తం 1,74,240 చదరపు గజాలను అమ్మితే రూ.139 కోట్లు వస్తాయి. మిల్లుకు చెందిన వసతి గదులను మాత్రమే విక్రయిస్తే రూ.20 కోట్ల వరకు చేతికి అందుతుంది. ఈ మొత్తంతో మిల్లుకు చెందిన అప్పులు, కార్మికులకు బకాయిలను చెల్లించవచ్ఛు ఇలాచేస్తే బ్యాంకులో ఉంచిన మిల్లుకు చెందిన దస్తావేజులు ప్రభుత్వం చేతికి అందుతాయి. ఆ తరువాత ప్రభుత్వం స్థలాల అమ్మకం, ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ గార్మెంట్‌ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతూ పార్లమెంటు సభ్యుడు రంగయ్య, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులను కలిసి విన్నవించారు. జిల్లా అధికారులు కూడా పరిశీలించి వెళ్లారు. ఆ తరువాత ఉలుకుపలుకు లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని