బందోబస్తు నడుమ సెమిస్టర్‌ పరీక్షలు
eenadu telugu news
Published : 29/07/2021 03:36 IST

బందోబస్తు నడుమ సెమిస్టర్‌ పరీక్షలు

ముఖద్వారం వద్ద డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐల తనిఖీ

ఎస్‌.కె.విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఎస్‌కేయూలో బుధవారం సెమిస్టర్‌ పరీక్షలు పోలీసు బందోబస్తు నడుమ ప్రారంభించారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ విజయభాస్కర్‌గౌడ్‌తోపాటు మరో ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, 130 మంది పోలీసులు మోహరించారు. ముఖద్వారం వద్ద తనిఖీలు చేశారు. వర్సిటీలోని ఆర్ట్స్‌ విద్యార్థులకు బుధవారం నుంచి పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మొదట 75శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతి ఇస్తామని అధికారులు ప్రకటించారు. కరోనా సమయంలో హాజరు శాతాన్ని ప్రామాణికంగా తీసుకోవడం సరికాదని విద్యార్థులు, సంఘాల నాయకుల నుంచి వ్యతిరేకత రావడంతో 40 శాతానికి తగ్గించారు. అయితే పూర్తిస్థాయిలో హాజరు నుంచి మినహాయించాలన్న డిమాండు నేపథ్యంలో పరీక్షలకు ఆటంకం కలిగిస్తారేమో అన్న అనుమానంతో ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

అందరిలోనూ భయాందోళన

ముఖద్వారం వద్దే భారీగా పోలీసులు మోహరించి విద్యార్థులను తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరి వివరాలు అడిగిన తర్వాతే లోపలకు అనుమతించారు. వర్సిటీ ప్రాంగణంలో ఎక్కడ చూసినా పోలీసు బలగాలు ఉండటంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈక్రమంలో ఎంఎల్‌ఐఎస్సీ విభాగానికి చెందిన ఓ విద్యార్థి పరీక్షా కేంద్రం వద్దకు వచ్చి విసుగుతో చరవాణి బండకు కొట్టి వెళ్లిపోయాడు. మరో విద్యార్థి తనకు కళ్లు తిరుగుతున్నాయని, వాంతులు వస్తున్నట్లు ఉందని చెప్పి పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే బయటకు వెళుతుండగా సంబంధిత విభాగపు ఆచార్యులు బతిమలాడి పరీక్ష సమయం పూర్తయ్యే వరకు అక్కడే కూర్చోబెట్టారు.

సజావుగా జరిగేందుకే..

పరీక్షలు సజావుగా జరగాలంటే ముందస్తు చర్యలు అవసరమని ఉపకులపతి రామకృష్ణారెడ్డి తెలిపారు. పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించాం. హాజరు శాతం తక్కువగా ఉన్న వారిని అనుమతించలేదు. 700 మంది విద్యార్థులకు గాను 587 మంది హాజరయ్యారని ఆయన వివరించారు. ఉపకులపతితోపాటు రెక్టార్‌ కృష్ణానాయక్‌, రిజిస్ట్రార్‌ కృష్ణకుమారి, ప్రధానాచార్యులు బాలసుబ్రహ్మణ్యం, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యూషన్స్‌ రమణ పరీక్షలను పరిశీలించారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు

పోలీసుల వలయంలో పరీక్షలు నిర్వహించడం బాధాకరమని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ వీరు యాదవ్‌ పేర్కొన్నారు. ఎస్కేయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హాజరు నిబంధనలతో 140 మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారన్నారు. అందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు మళ్లీ నిర్వహించాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని