కాపు కాశారు.. కట్టడి చేశారు!
eenadu telugu news
Updated : 29/07/2021 12:54 IST

కాపు కాశారు.. కట్టడి చేశారు!

రూ.66.39 లక్షల టెండరుపై కన్ను

ఓ నాయకుడి అనుచరుల హడావుడి

కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెండరు బాక్సు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: జిల్లాలోని 62 కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయాల్లోని (కేజీబీవీ) బాలికలకు దుప్పట్ల సరఫరాకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. అనంతపురంలోని సర్వశిక్ష కార్యాలయంలో టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించారు. ఏదైనా పనులకు టెండర్లు కోరితే గుత్తేదారులు కుమ్మక్కై తక్కువ ధరకు చేజిక్కించుకోవడం సహజం. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా సాగుతోంది. టెండరు దక్కించుకునేందుకు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కన్నేశారు. ఇతరులెవరూ దాఖలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈక్రమంలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన అనుచరులు కార్యాలయ ప్రాంగణలోనే మకాం వేశారు. ఎవరైనా అక్కడికి రాగానే, వారిని నిలిపేసి వివరాలు సేకరించారు. టెండరు వేసేందుకు వచ్చిన వారితో బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఈ పరిస్థితిని గమనించిన ఉన్నతాధికారి ఏకంగా పోలీసుల రక్షణ కోరడం విశేషం.

జిల్లాలోని కస్తూరిబాగాంధీ విద్యాలయాల్లోని బాలికలకు పరచుకోవడానికి, కప్పుకోవడానికి (బెడ్డింగ్‌ మెటీరియల్‌) రగ్గులు సరఫరా చేయాల్సి ఉంది. మెటీరియల్‌తో కూడిన బెడ్‌షీటు సరఫరా చేస్తారు. ఆయా కేజీబీవీల్లో మొత్తం 13,400 మంది విద్యార్థినులు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి బెడ్డింగ్‌ మెటీరియల్‌ ధర రూ.1,100కు సరఫరా చేయాల్సి ఉంది. మొత్తం రూ.66,39,600 విలువకు టెండరు ఆహ్వానించారు. ఇందులో తక్కువ ధరకు కోట్‌ చేసిన వారికే టెండరు దక్కుతుంది. అయితే టెండరును ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో నాయకుడి అనుచరగణం రంగంలోకి దిగింది. కార్యాలయం వద్ద కాపు కాసి పలు రూపాల్లో భయపెట్టే ప్రయత్నం చేశారు.

షెడ్యూల్‌ తీసుకోద్దు

బుక్కరాయసముద్రం మండలానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం మధ్యాహ్నం టెండరు షెడ్యూల్‌ను కొనుగోలు చేయడానికి అక్కడకు చేరుకున్నారు. ఆయన రాగానే నాయకుడి అనుచరులు అడ్డుకున్నారు. టెండరు షెడ్యూల్‌ తీసుకోవద్దంటూ హెచ్చరించారు. ఇప్పటికే షెడ్యూల్‌ తీసుకున్నానని సదరు ప్రతినిధి చెప్పడంతో.. నీ గురించి తర్వాత ఆలోచిస్తామంటూ వారు మాట్లాడారు.

రక్షణ కోరిన అధికారి

టెండరు ఫారాలు కావాలంటే కలెక్టరు, ఛైర్మన్‌, సమగ్రశిక్ష పేరు మీద రూ.5 వేలు జాతీయ బ్యాంకులో డీడీ తీయాలి. గురువారం సాయంత్రం 5గంటల్లోపు కార్యాలయంలో ఉంచిన పెట్టెలో సీల్డ్‌ టెండర్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. బుధవారం సాయంత్రం వరకు ఆరుగురు మాత్రమే టెండరు ఫారాలు కొనుగోలు చేశారు. ఒక్కరు కూడా పెట్టెలో టెండరు వేయలేదు. ఈ నేపథ్యంలో సమగ్రశిక్ష ఉన్నతాధికారి రక్షణ కల్పించాలంటూ బుధవారం పోలీసులకు రాత పూర్వకంగా కోరారు.

పారదర్శకంగా చేపడతాం

- తిలక్‌విద్యాసాగర్‌, సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్త

ఎవరైతే తక్కువకు కోట్‌ చేస్తారో వారినే ఎంపిక చేస్తాం. నిబంధనల మేరకు టెండర్లు పరిశీలిస్తాం. 30న టెండరు ఓపెన్‌ చేస్తాం. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని బుధవారం కోరా. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా వచ్చి టెండరు ఫారాలు కోనుగోలు చేసి, దాఖలు చేయవచ్ఛు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని