చెత్తపై పన్ను హేయమైన చర్య
eenadu telugu news
Published : 29/07/2021 03:36 IST

చెత్తపై పన్ను హేయమైన చర్య

కాలవ శ్రీనివాసులు, తెదేపా శ్రేణుల ప్రదర్శన

రాయదుర్గం, న్యూస్‌టుడే: చెత్తపై పన్ను విధించటం హేయమైన చర్య అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. పన్నును నిరసిస్తూ బుధవారం రాయదుర్గంలో ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా చెత్తపై పన్ను విధించడం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు. ప్రభుత్వ విచిత్రమైన చర్యలతో ప్రజలపై రూ.8వేల కోట్ల అదనపు భారం పడుతుందని ఆరోపించారు. సంక్షేమ పథకాల్లో అర్హులైన లబ్ధిదారులకు అరకొరసాయం అందిస్తున్నారని మండిపడ్డారు. పట్టణంలో వేలాదిమంది గార్మెంట్‌ కార్మికులు అర్ధాకలితో అలమటిస్తుంటే కేవలం 39 మందికి మాత్రమే నేతన్ననేస్తం సాయం అందించారని అన్నారు. ప్రచార ఆర్భాటాలు తప్ప రెండేళ్లలో చేసింది శూన్యమని విమర్శించారు. వైఎస్సార్‌ నవశకం పేరిట అర్హుల రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లపట్టాలు తొలగించటం దారుణమన్నారు. వైకాపా నాయకులు రైతులతో తక్కువ ధరకు భూములు కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకు అమ్ముకుని జేబులు నింపుకొన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రశాంతి, జ్యోతి, పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్లు గాజుల వెంకటేశులు, మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని