అద్దె చెల్లించలేక..సొంతింట్లో చేరలేక!
eenadu telugu news
Published : 29/07/2021 03:36 IST

అద్దె చెల్లించలేక..సొంతింట్లో చేరలేక!

అందని ద్రాక్షలా టిడ్కో ఇళ్లు

నిర్మాణాలు పూర్తయినా ప్రవేశాల్లేవు

రెండేళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపు

ధర్మవరం పట్టణంలో మొదటి ఫేజ్‌లో 1,440 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో రెండేళ్ల కిందట 146 గృహాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నిలిచిపోయాయి. 300 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి మాత్రమే రివర్స్‌ టెండరింగ్‌ పనులు ప్రారంభించారు. మిగిలిన విభాగాల ఇళ్ల నిర్మాణాలు రెండేళ్లుగా నిలిచిపోయాయి.

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: సొంతిల్లు కట్టుకోవాలనేది ప్రతి నిరుపేద కల. పల్లెలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో ఇంటి నిర్మాణం ఖర్చు, కష్టంతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో పట్టణాల్లో నివసించే పేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో అడుగులు పడ్డాయి. సొంతిల్లు వస్తుందనే ఆశతో లబ్ధిదారులు అప్పులు చేసి మరీ తమ వాటా చెల్లించారు. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తికావస్తుండటంతో త్వరలోనే చేరవచ్చని సంబరపడ్డారు. రోజులు నెలలు అయ్యాయి. నెలలు ఏళ్లయ్యాయి. అయినా సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయినా ప్రభుత్వ అనుగ్రహం లేక లబ్ధిదారులకు అందడం లేదు. మరోవైపు పట్టణ పేదలపై అద్దె భారం పడుతోంది.

సొమ్ము చెల్లించినా..

పట్టణ పేదలకు అందించే ఇళ్లను మూడు రకాలుగా విభజించి నిర్మాణాలు చేపట్టారు. 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడకల ఇళ్లు నిర్మించారు. దీనికి సంబంధించి లబ్ధిదారు తన వాటా కింద నాలుగు విడతల్లో రూ.లక్ష చెల్లించాలి. 365 చదరపు అడుగుల్లో ఒకే పడక గది ఇళ్లను నిర్మించారు. దీనికి ప్రతి లబ్ధిదారు నాలుగు విడతల్లో రూ.50 వేలు చెల్లించాలి. 300 చ.అ.ల్లో ఒకే పడక గది ఇళ్లను నిర్మించారు. దీనికి ప్రతి లబ్ధిదారు తన వాటాగా రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. జిల్లాలో చాలామంది లబ్ధిదారులు తమ వాటాను డీడీల రూపంలో ఇప్పటికే చెల్లించారు. ఆ నగదు మున్సిపల్‌, నగర కమిషనర్ల ఖాతాల్లో జమ చేశారు. పలు పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం 80 శాతం మేర పూర్తయింది. తాడిపత్రిలో కొన్ని చిన్నపాటి పనులు మినహాయించి పూర్తి చేశారు. అయినా ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇల్లు అందించలేదు. దీంతోపాటు డీడీలు చెల్లించిన చాలామంది లబ్ధిదారులను వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనర్హులుగా ప్రకటించి, వారి స్థానంలో కొత్తవారికి కేటాయించారు. పాత లబ్ధిదారులు చెల్లించిన వాటాను తిరిగి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు అది అమలు కాలేదు. అనర్హతకు గురైన లబ్ధిదారులకు రూ.33.52 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

రివర్స్‌ టెండరింగ్‌

గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను షేర్‌వాల్‌ సాంకేతికతతో నిర్మించారు. సంప్రదాయ పద్ధతితో పోల్చుకుంటే ఈ విధానం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని భావించిన వైకాపా ప్రభుత్వం 25 శాతం కంటే తక్కువ పూర్తయిన అన్ని నిర్మాణాలను ప్రభుత్వం నిలిపేసింది. పలుచోట్ల రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పనులను వేరే సంస్థలకు అప్పగించింది. గతంలో ప్రతిపాదించిన మూడు విభాగాల్లో కాకుండా కేవలం 300 చదరపు అడుగుల్లో ఇళ్లను నిర్మించి ఇచ్చే పనులను మాత్రమే పునఃప్రారంభించారు. ఇలా తాడిపత్రిలో 1,776, ధర్మవరంలో 1,344, గుంతకల్లులో 2,160, అనంతపురంలో 2,112, రాయదుర్గంలో 1,008 ఇళ్ల నిర్మాణ పనులను చేపట్టారు. ఇవి కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఇలాగైతే నిర్మాణాలు పూర్తయ్యేదెప్పుడు, తమ సొంతింటి కల నెరవేరేదెన్నడని లబ్ధిదారులు వాపోతున్నారు.

తెదేపా హయాంలో శ్రీకారం

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ఎన్టీఆర్‌ గృహ పథకం కింద పట్టణ పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వడానికి తెదేపా హయాంలో 2018లో శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద జిల్లాలో 61,556 ఇళ్లు మంజూరయ్యాయి. ఫేజ్‌-1లో 3,009, ఫేజ్‌-2లో 24,497, ఫేజ్‌-3లో 23,408, ఫేజ్‌-4లో 10,642 ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 50,914 గృహ నిర్మాణాలకు సంబంధించి టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టారు. పట్టణ ప్రాంతాల్లో జీ+3 పద్ధతిలో చేపట్టారు. అప్పట్లోనే 47,373 మందిని అర్హులుగా తేల్చగా.. వారిలో 31,127 మంది లబ్ధిదారు వాటా చెల్లించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో వీటిపై దృష్టి పెట్టలేదు. లబ్ధిదారులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తమ వాటా చెల్లించడానికి చేసిన అప్పులు తీర్చడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు అద్దె ఇళ్లల్లో కాలం వెళ్లదీస్తూ ప్రభుత్వం ఎప్పటికైనా కనికరించకపోదా అని ఎదురుచూస్తున్నారు.

పనులు అప్పగించాం

శ్యామ్‌సుందర్‌, ఈఈ, ఏపీ టిడ్కో

టిడ్కో గృహాలకు సంబంధించి 25 శాతంలోపు జరిగిన పనులు రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం పట్టణాల్లో పనులు తిరిగి ప్రారంభించాం. మిగిలిన ఇళ్ల పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. బేస్‌మెంట్‌ స్థాయి దాటిన పనులన్నింటినీ పాత సంస్థలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హిందూపురం పట్టణంలో రూ.160 కోట్లతో మొదటి ఫేజ్‌లో 2,750 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో 1,200 ఇళ్ల నిర్మాణాలు 80 శాతం పూర్తయ్యాయి. కిటికీలు, తలుపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. మిగిలిన 1,550 ఇళ్లకు సంబంధించి 10 శాతంలోపే పనులు జరగడంతో వైకాపా ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేదు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ప్రస్తుతం అవి అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నవి తాడిపత్రి పట్ణణంలో నిర్మించిన టిడ్కో గృహాలు. తాడిపత్రి నుంచి కడపకు వెళ్లే మార్గంలో మొత్తం 6,529 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 80 శాతం పనులు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,136 ఇళ్లను రద్దు చేశారు. ప్రస్తుతం 5,184 మందికి ఇళ్లు కేటాయించారు. కొన్ని చిన్నచిన్న పనులు చేస్తే లబ్ధిదారులకు అందించవచ్ఛు రెండేళ్లు కావస్తున్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు.

జిల్లాలో ఇదీ పరిస్థితి

మంజూరైన ఇళ్లు : 61,556

నిర్మాణ దశలో ఉన్నవి: 50,914

ప్రాజెక్టు అంచనా: రూ.3,351 కోట్లు

అర్హులుగా గుర్తించిన వారు: 47,373

వాటా చెల్లించిన లబ్ధిదారులు: 31,127

మున్సిపాలిటీల వారీగా మంజూరు

తాడిపత్రి : 6,529

ధర్మవరం : 8,832

గుత్తి : 398

హిందూపురం : 13,531

కదిరి : 3,762

కళ్యాణదుర్గం : 1,393

పామిడి : 2,599

పుట్టపర్తి : 1,243

అనంతపురం : 6,117

గుంతకల్లు : 4,719

రాయదుర్గం : 1,791


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని