ఫలితం తేలింది !
eenadu telugu news
Published : 24/07/2021 06:34 IST

ఫలితం తేలింది !

ద్వితీయ ఇంటర్‌లో ఉత్తమ మార్కులు 

ఫలితాల సరళిని చూస్తున్న ఆర్‌ఐఓ వెంకటరమణనాయక్‌ 

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఎట్టకేలకు ద్వితీయ ఇంటర్‌ ఫలితాలను ప్రకటించారు. కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఫీజు చెల్లించిన ప్రతి ఒక్కరినీ పాస్‌ చేశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం, పదో తరగతిలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని, ద్వితీయ ఇంటర్‌ మార్కులను కేటాయించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఉత్కంఠ వీడింది. జిల్లాకు చెందిన పలువురు అధిక మార్కులు సాధించారు.

30,030 మంది.. జిల్లాలో 30,030 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 14,747, బాలికలు 15,283 మంది ఉన్నారు. గతేడాది జిల్లాలో 54 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వ΄డు సబ్జెక్టులను పరిగణలోకి తీసుకుని 30 శాతం, ఇంటర్‌ మొదటి సంవత్సరం మార్కులలో 70 శాతం వెయిటేజీని లెక్కగట్టి మార్కులు నిర్ణయించారు. ఏప్రిల్‌లో 
జరిగిన ప్రయోగ పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులకు కనీస మార్కులు వేశారు. అయితే కొందరు విద్యార్థులకు అనారోగ్యం, ఇతర కారణాలతో ఇంటర్‌ ప్రథమ, పదో తరగతిలో ఆశించిన ఫలితాలు సాధించలేదు. అలాంటి వారికి ద్వితీయ ఇంటర్‌ మార్కులపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఆర్‌ఐఓ వెంకటరమణ నాయక్‌ తెలిపారు.

హైదరాబాద్‌ వదిలి..  అనంత చేరి

హిందూపురంలోని టీచర్స్‌ కాలనీలో నివాసం ఉంటున్న నివేదిత ఎంపీసీలో 988 మార్కులు సాధించింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో చేరగా.. అక్కడిపరిస్థితులు అనుకూలించక, అనంతలోని ప్రైవేటు కళాశాలలో విద్యను అభ్యసించింది. బంధువుల ఇంట్లో ఉండి  చదివింది. తల్లిదండ్రులు కవిత, సత్యనారాయణరావు ఇద్దరూ ఉపాధ్యాయులే. పదోతరగతిలో 10 పాయింట్లు సాధించింది. ఇంటర్‌ ప్రథమ 463 మార్కులతో ఉత్తీర్ణురాలైంది. కంప్యూటర్‌ సైన్సు చేసి ఇంజినీరు కావాలన్నదే ధ్యేయమని తెలిపింది. 

ఆ ఫలితమే మార్చేసింది..

అనంతపురంలోని లెక్చరర్స్‌ కాలనీకి చెందిన సాయిగణేష్‌ ఎంపీసీలో 988 మార్కులు సాధించాడు. నాన్న శంకర్‌నారాయణ ధర్మవరంలో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. అమ్మ అమృత ఓ ప్రైవేటు పాఠశాలలో టీచరు. పదో తరగతిలో 9.8 పాయింట్లు రావడంతో నిరుత్సాహం చెందానని, ఇంటర్‌లో మరింత కసితో చదివి ఉత్తమ మార్కులు సాధించినట్లు విద్యార్థి తెలిపాడు. జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకు సాధిస్తానన్న నమ్మకం ఉందని చెప్పాడు.   

వైద్య విద్యే లక్ష్యం

ఉరవకొండ: ఉరవకొండకు చెందిన విద్యార్థిని నాగమల్లి వర్షిణి బైపీసీలో 987 మార్కులు సాధించింది. ఈమె విజయవాడలో ఓ ప్రైవేటు కళాశాలలో విద్యను అభ్యసించింది. తల్లిదండ్రులు మల్లికార్జున, శమంతకమణి హోటల్‌ నిర్వహిస్తూ తమ కుమార్తెను చదివిస్తున్నారు. నీట్‌ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాలన్నదే లక్ష్యమని విద్యార్థిని పేర్కొంది. వైద్యురాలిగా సామాజిక సేవల్లో భాగస్వామి కావాలన్న తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తానని ధీమా వ్యక్తం చేసింది. 

చక్కటి ప్రణాళికతోనే..

అనంత పాతూరు కూరగాయల వీధికి చెందిన దాక్షాయణి ఎంపీసీలో 986 మార్కులు సాధించింది. స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో విద్యను అభ్యసించింది. నాన్న రామ్మోహన్‌ వ్యాపార వేత్త. అమ్మ సంధ్య గృహిణి. పదిలో 10 పాయింట్లు, ప్రథమ ఇంటర్‌లో 463 మార్కులు వచ్చాయి. చక్కటి ప్రణాళికాబద్ధంగా చదివినట్లు  విద్యార్థిని తెలిపింది.  

రైతు బిడ్డ ప్రతిభ

కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లికి చెందిన పూజిత ఎంపీసీలో 986 మార్కులు సాధించింది. నాన్న నాగభూషణం రైతు. అమ్మ వనజ గృహిణి. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి పట్టుదలతో చదివానని, కళాశాలలో ఇచ్చిన ప్రశ్నావళి బ్యాంకు ఉపకరించినట్లు తెలిపింది. జేఈఈలో మంచి ర్యాంకు సాధించి, ఇంజినీరింగ్‌ పూర్తి చేసి వ్యాపార వేత్త కావాలన్నదే ధ్యేయమని పేర్కొంది. 

ఇష్టంగా చదివా

అనంతపురంలోని వేణుగోపాల్‌నగర్‌కు చెందిన సులోచన ఎంపీసీలో 986 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అమ్మ సులోచన గృహిణి. విద్యార్థిని నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యను అభ్యసించింది. ప్రస్తుతం జేఈఈ మెయిన్‌కు సన్నద్ధం అవుతోంది. ఇష్టపడి చదివానని, ఐఐటీలో ఇంజినీరింగ్‌ చేయాలన్నదే ఆశయమని పేర్కొంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని