తల్లిడిల్లిన ప్రాణాలు
eenadu telugu news
Published : 24/07/2021 06:34 IST

తల్లిడిల్లిన ప్రాణాలు

యాస్మిన్‌ (పాతచిత్రం)

చిన్నారి జలుబు.. అమ్మకు గుబులు రేపింది. బిడ్డకు ఊపిరాడటంలేదని.. తల్లి తల్లడిల్లిపోయింది. అర్ధరాత్రి అయోమయం.. ఆమెను వెంటాడిన భయం. ఔషధం లేదని కలవరం.. పరుగు పరుగున పయనం. మృత్యువు వెంటాడింది.. విషాదంలోకి నెట్టేసింది. అమ్మకు ఆయుష్షు తీరింది..  పాపాయికి కన్నీరే మిగిలింది. 

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: రెండేళ్ల చిన్నారికి జలుబు మందు తెచ్చేందుకు వెళ్లిన తల్లి ప్రమాదంలో మృత్యువాత పడిన సంఘటన గురువారం వేకువజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంత నగరానికి చెందిన యాస్మిన్‌(29), శ్రీనివాసనగర్‌కు చెందిన జగదీశ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. దంపతులకు రెండేళ్ల కుమార్తె ఉంది. చిన్నారికి జలుబు చేయడంతో గురువారం అర్ధరాత్రి సమయంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. తల్లి నిద్ర లేచి చూసింది. భర్తను లేపి పాపకు మందు తీసుకురావాలని సూచించింది. ఉదయం ఆసుపత్రికి వెళ్దామని, అప్పటి వరకు ఇబ్బంది లేదని భర్త చెప్పాడు. కొంత సేపటి తర్వాత చిన్నారిని చూసి తల్లి హృదయం తల్లడిల్లింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందైతే పాప ప్రాణానికే ప్రమాదమని ఆందోళన చెందింది. అర్ధరాత్రి 2గంటల సమయంలో మందుల చీటీ పట్టుకొని తన స్కూటీపై దుకాణానికి బయల్దేరింది. చంద్ర ఆసుపత్రి కూడలి దాటగానే వెనుక వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో యాస్మిన్‌ అక్కడికక్కడే మృతిచెందింది. విషయాన్ని గమనించిన రాత్రి విధుల్లో ఉన్న ఎస్సై జగదీశ్‌ ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు. యాస్మిన్‌ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గస్తీ కానిస్టేబుల్‌ శివకుమార్‌ ప్రమాదానికి కారణమైన కారును వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని 
దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రమాదానికి కారణమైన కారు  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని