చదరంగంలో గెలుపు తరంగాలు
eenadu telugu news
Published : 24/07/2021 06:34 IST

చదరంగంలో గెలుపు తరంగాలు

● విద్యార్థుల మేథోశక్తి వికాసం

● జాతీయస్థాయిలో గుర్తింపు


చదరంగంలో శిక్షణ పొందుతున్న చిన్నారులు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: మనిషి మెదడుకు పదును పెట్టే క్రీడ చదరంగం. ఈ క్రీడ మనదేశంలోనే పుట్టింది. మేథోశక్తి వికాసానికి దోహదపడే ఈ క్రీడలో మనదేశం నుంచి ఎంతోమంది గ్రాండ్‌ మాస్టర్లుగా ఎదిగారు. ఇటీవల చదరంగం పోటీలు నిర్వహించారు. మన జిల్లాలో కూడా పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ ఫిడే రేటింగ్‌ సాధించారు. అంతర్జాలం ద్వారా నిర్వహించిన జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో మన జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. ఏ-1 చెస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న చిన్నారులు పతకాలు సాధించి జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారు. కరోనా కర్ఫ్యూ ఉన్నా ఆన్‌లైన్‌ సాధన చేసి పతకాలు సాధించారు.

యోగ‘సాగరం’

అనంత నగరానికి చెందిన లాక్షిణ్య పదో తరగతి చదువుతోంది. రాష్ట్ర చెస్‌ సంఘం ఆధ్వర్యంలో గత నెలలో జరిగిన రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో అండర్‌-14 బాలికల విభాగంలో ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ అందుకుంది. పోటీల్లో తొమ్మిది రౌండ్లలో తలపడి 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. జాతీయస్థాయి పోటీలకు కూడా ఎంపికైంది. మన రాష్ట్రం తరఫున జాతీయస్థాయి పోటీలకు ప్రాతిన్ఖిధ్యం వహించింది. బాలికల విభాగంలో రాష్ట్రంలో ప్రథమస్థానం సాధించిన తొలి బాలికగా జిల్లాలో ఘనత సాధించింది. భవిష్యత్తులో ఉన్నతస్థాయిని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భువనకృతి.. గెలుపు ఆకృతి

నగరానికి చెందిన భువనకృతి ఎనిమిదో తరగతి చదువుతోంది. తక్కువ సమయంలోనే ప్రతిభ చాటుతోంది. గత ఏడాదిలో చెస్‌లో అరంగ్రేటం చేసిన ఈ బాలిక ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ పొందుతూ విజయాలు అందుకుంటోంది. ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించిన జాతీయస్థాయి అండర్‌-13 ఆన్‌లైన్‌ చదరంగం పోటీల్లో సత్తాచాటింది. దేశ వ్యాప్తంగా మొత్తం 226 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ఈ బాలిక 25వ స్థానం కైవశం చేకుంది. తొమ్మిది రౌండ్లలో ఆరు రౌండ్లు నెగ్గింది. చదరంగంలో గ్రాండ్‌మాస్టర్‌ కావాలన్నదే తన ఆశయమని పేర్కొంది.

శ్రీహ.. వ్యూహాల హవా

అంతర్జాతీయ ఫిడే రేటింగ్‌ స్థానం సాధించిన అతికొద్దిమందిలో శ్రీహ ఒకరు. ఏడో తరగతి చుదువున్న బాలిక.. ఆటలో అరంగ్రేటం చేసిన రెండేళ్లలోపే ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది మార్చిలో ఆళ్లగడ్డలో జరిగిన రాష్ట్రస్థాయి ఓపెన్‌ చెస్‌ పోటీల్లో బహుమతి అందుకుంది. హైదరాబాద్‌లో తొలి ఫిడే రేటింగ్‌ పోటీల్లో అండర్‌-11 బాలికల విభాగంలో శ్రీహ ద్వితీయస్థానం సాధించింది. పది గ్రాములు వెండి నాణెం, ట్రోఫీ, ప్రశంసా పత్రం అందుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు సాధించింది. గత మేన ఫిడే ప్రచురించిన ఫలితాల్లో శ్రీహ 1151 రేటింగ్‌ సాధించింది. నిరంతర సాధనతో అంతర్జాతీయ పోటీల్లో గుర్తింపు సాధిస్థానని శ్రీహ ధీమా వ్యక్తం చేసింది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని