విషపూరిత చేపలొస్తున్నాయ్‌.. జాగ్రత్త!
eenadu telugu news
Published : 24/07/2021 06:18 IST

విషపూరిత చేపలొస్తున్నాయ్‌.. జాగ్రత్త!

● అధికారుల పర్యవేక్షణ లేకనే

● హోటళ్లల్లోనూ అమ్మకాలు

క్యాట్‌ ఫిష్‌

అనంతపురం (కమలానగర్‌), న్యూస్‌టుడే: చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది. వైద్యులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. కరోనా కారణంగా అందరూ పోషకాహారం తీసుకుంటున్నారు. ఈక్రమంలో చేపలకు డిమాండు పెరుగుతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు విషపూరిత చేపలను విక్రయిస్తున్నారు. తాజా చేపలు కొనడానికి చెరువుల వద్దకు వెళ్లలేని పరిస్థితి. దగ్గరలోని మార్కెట్‌కు వెళితే అవి తాజావేనా అన్న సందేహం వస్తుంది. మార్కెట్‌లో కొంతమంది వారాలపాటు ఐస్‌ బాక్సుల్లో పెట్టి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. ఇటీవల మార్కెట్‌లో మార్వాలు (క్యాట్‌ ఫిష్‌), విషపూరిత చేపలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజలు కొనుగోలు చేసే సమయంలో వాటిని పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

24 సహకార సంఘాలు

జిల్లాలో 24 మహిళ మత్స్య సహకార సంఘాలున్నాయి. ఇందులో 1,099 మంది సభ్యులు ఉన్నారు. 19 మంది సభ్యులతో మార్కెట్‌ సొసైటీ ఏర్పాటైంది. ఒక్క అనంతపురం చేపల మార్కెట్‌లోనే 20 దుకాణాలు ఉన్నాయి. ఇందులో 15 దుకాణాల్లో నిత్యం చేపల విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్కో దుకాణంలో ఇద్దరు లేదా ముగ్గురు ఉపాధి పొందుతున్నారు. ఆది, మంగళవారాల్లో 8 నుంచి 10 టన్నుల వరకు చేపల విక్రయాలు జరుపుతున్నారు. మిగతా రోజుల్లో 3 నుంచి 5 టన్నుల వరకు విక్రయిస్తారు.

క్యాట్‌ ఫిష్‌తో ముప్పు

మార్వాలు చేపలను క్యాట్‌ ఫిష్‌గా పిలుస్తారు. ఇవి విషపూరితమై ఉంటాయి. వీటి పెంపకం చేపట్టకూడదని, విక్రయాలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ చేపల పెంపకానికి చికెన్‌ వ్యర్థాలు, చనిపోయిన పశువుల వ్యర్థాలను ఆహారంగా అందిస్తారు. దీంతో విషపూరితంగా మారుతాయి. వాటిని తింటే ప్రమాదకరమని ప్రభుత్వాలు నిషేధించాయి. ఇటీవల అనంతపురం మార్కెట్‌లో క్యాట్‌ ఫిష్‌ అమ్ముతున్నారనే సమాచారం రావడంతో జిల్లా ఆహార భద్రతశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మార్కెట్‌కు విషపూరిత చేపలు వస్తున్న మాట వాస్తవమేనని కొందరు వ్యాపారులే చెప్పడం గమనార్హం. ఎవరైనా ప్రత్యేకంగా క్యాట్‌ఫిష్‌ కావాలని అడిగితే వ్యాపారులు తీసుకొచ్చి అమ్ముతున్నట్లు అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు వారిని హెచ్చరించారు. తనిఖీలు లేవీ..: మార్కెట్లలో విక్రయించే చేపలు తాజాగా ఉన్నాయా.. ఐస్‌ పెట్టెల్లో ఎన్నిరోజులు నిల్వ ఉంచున్నారు.. అన్నదానిపై తనిఖీలు చేసేవారే లేరు. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే మార్కెట్ల వైపు చూస్తున్నారు. హోటళ్లలో తయారు చేసే వంటకాలను పరిశీలించడం లేదు. విష పూరిత చేపలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరు తీసుకొస్తున్నారో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

కొంతమంది హోటళ్లల్లోనూ క్యాట్‌ ఫిష్‌ వంటకాలు అమ్ముతున్నట్లు తెలిసింది. మరోవైపు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి చేపలను తెప్పించి, వారాల తరబడి ఐస్‌ పెట్టెల్లో నిల్వ ఉంచుతున్నారు. వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

సిబ్బంది పర్యవేక్షణ కొరవడిన మాట వాస్తవమే. మార్కెట్‌లోకి క్యాట్‌ఫిష్‌ వచ్చిందని సమాచారం అందింది. విక్రయదారులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం. క్రయవిక్రయాలపై నిఘా పెంచుతాం. హోటళ్లపైనా పర్యవేక్షణ అవసరం. తాజా చేపలు విక్రయించేలా చూస్తాం. - చంద్రశేఖర్‌రెడ్డి, మత్స్యశాఖ ఇన్‌ఛార్జి డీడీ

మార్కెట్‌లో ఆహార భద్రత అధికారుల తనిఖీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని