వెలుగులో రేషనలైజేషన్‌!
eenadu telugu news
Published : 24/07/2021 06:18 IST

వెలుగులో రేషనలైజేషన్‌!

యానిమేటర్ల నిరసన

సెర్ప్‌ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటిదాకా కనీసం 15 స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) ఒక వీఓను నెలకొల్పారు. ఈ లెక్కన ప్రతి వీఓకు ఒక యానిమేటర్‌ ఉన్నారు. తాజా సర్క్యులర్‌ ప్రకారం 30 నుంచి 50 చిన్న సంఘాలకు ఒక గ్రామ సంఘం ఉండాలన్న నిబంధన పెట్టారు. దీనిప్రకారం రేషనలైజేషన్‌ చేస్తే గ్రామ సంఘాల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. జిల్లాలో 1500 మందికిపైగా యానిమేటర్ల ఉద్యోగంపై ప్రభావం చూపనుంది.

పెద్దవడుగూరు మండలంలో మొత్తం 46 గ్రామ సంఘాలు(వీఓ) ఉన్నాయి. వీటిలో 15 స్వయం సహాయ సంఘాల్లోపు ఉన్న వీఓలు 18 ఉన్నాయి. 18 వీఓల్లో పని చేస్తున్న గ్రామ సంఘ సహాయకులకు (యానిమేటర్‌) మార్చి-జూన్‌ దాకా వేతనాన్ని నిర్దేశిత యాప్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. ఇలాంటి వీవోలు జిల్లాలో పెద్దసంఖ్యలోనే ఉన్నాయి.

అనంతపురం (శ్రీనివాసనగర్‌), న్యూస్‌టుడే: డీఆర్‌డీఏ-వెలుగు ప్రాజెక్టులో కలవరం మొదలైంది. సెర్ప్‌ జారీ చేసిన సర్క్యులర్‌ 64 యానిమేటర్లల్లో భయాన్ని సృష్టిస్తోంది. ఒక్కో గ్రామ సంఘంలో(వీఓ) 30-50 చిన్న సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ఉండాలన్న నిబంధన విధించారు. రేషనలైజేషన్‌ పేరుతో విలీన ప్రక్రియ చేయాలని సంకల్పించారు. దీంతో వీఓల సంఖ్య సగం తగ్గనుంది. ఫలితంగా యానిమేటర్ల ఉద్యోగంపై ప్రభావం చూపనుంది. కొత్త సర్క్యులర్‌పై యానిమేటర్లు మండిపడుతున్నారు. తమ పొట్ట కొట్టొద్దంటూ నిరసన గళం విప్పారు. ప్రస్తుతం 15 మహిళా సంఘాలకు ఒక వీఓను ఏర్పాటు చేసుకున్నారు. కొన్నిచోట్లా 20, 30 దాకా ఉన్నాయి. ఊర్లో ఉండే సంఘాలను బట్టి వీఓలు ఉన్నాయి. తాజా మార్గదర్శకాల ప్రకారం గ్రామ సచివాలయం లేదా పంచాయతీని యూనిట్‌గా తీసుకుని విలీన ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. ఒక ఊరి నుంచి మరో గ్రామంలోని వీఓలో సంఘాలు విలీనం కావడానికి ఇష్టపడరు. ఈక్రమంలో వివాదం తలెత్తనుంది.

జిల్లాలో 2,765 వీఓలు

జిల్లా వ్యాప్తంగా వెలుగు ప్రాజెక్టు పరిధిలో 2,765 గ్రామ సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో మహిళా సంఘాలు 57 వేలు, సభ్యులు 7 లక్షలకుపైగా ఉన్నారు. 8 నుంచి 15 మహిళా సంఘాల్లోపు వెయ్యికిపైగా వీఓలు ఉన్నట్లు తెలుస్తోంది. 30 సంఘాల్లోపు 1500పైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. తండాల్లో చిన్న సంఘాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల మధ్య నాలుగైదు కి.మీ. దూరం ఉంది. ఈక్రమంలో విలీనం ఎలా చేస్తారన్నదే ప్రశ్నార్థకం.

సర్వత్రా ఆందోళన

డ్వాక్రా సంఘాలు ఏర్పాటై 23 ఏళ్లు అవుతోంది. అప్పట్నుంచీ పని చేస్తున్న యానిమేటర్లు వందల్లోనే ఉన్నారు. జిల్లాలో 2,765 మంది యానిమేటర్లు పని చేస్తున్నారు. రేషనలైజేషన్‌, విలీనం ప్రక్రియ అమలైతే సగం మంది ఇంటికి వెళ్లాల్సిందే అన్న చర్చ నడుస్తోంది. 2019 డిసెంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి దాకా రూ.8 వేలు చొప్పున వేతనం ఇచ్చారు. మార్చి నుంచి జూన్‌ దాకా వేతనం ఇవ్వాల్సి ఉంది. 15 సంఘాల్లోపు ఉన్న వీఓలు 900పైగా ఉన్నాయి. వీటి పరిధిలోని యానిమేటర్లకు నాలుగు నెలల వేతనం అప్‌లోడ్‌ చేయలేదని తెలుస్తోంది.

30 సంఘాలు తప్పనిసరి

జులై దాకా ఒక్కో వీఓలో 15 సంఘాలు ఉన్నా యానిమేటర్లకు వేతనం ఇవ్వనున్నారు. ఆగస్టు నుంచి వేతనం పొందాలంటే విధిగా కనీసం 30 సంఘాలు ఉండాలన్న మార్గదర్శకాలు వచ్చాయి. మరోవైపు మూడేళ్ల అనుభవం మీరిన వారిని తొలగించి కొత్త వారిని నియమించుకోవాలన్న నిబంధన తెరపైకి వచ్చింది. కేవలం మహిళలే ఉండాలన్న దానిపైనా చర్చకు తెర తీశారు. 20-45 ఏళ్లలోపు ఉన్న వారిని యానిమేటర్లుగా కొనసాగించాలి. మిగతా వారిని తొలగించాలంటూ కొత్త సర్క్యులర్‌లో పేర్కొన్నారు. దీంతో యానిమేటర్లు భయాందోళన చెందుతున్నారు.

పూర్తి మార్గదర్శకాలు రావాలి

రేషనలైజేషన్‌పై సర్క్యులర్‌ వచ్చింది. ఎలా అమలు చేయాలన్న దానిపై పూర్తి స్థాయి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఇప్పటి సర్క్యులర్‌ ఆధారంగా విలీనం జరగలేదు. గ్రామ సచివాలయ పరిధిలో సంఘాలు, వీఓలు ఎన్ని ఉన్నాయి. యానిమేటర్ల ఖాళీల సంఖ్య.. వంటి వాటిని అడిగారు. సర్క్యులర్‌లో పాత నిబంధనలే ఉన్నాయి. కొత్తగా ఏమీ రాలేదు. - నరసింహారెడ్డి, పీడీ, డీఆర్‌డీఏ-వెలుగు

 

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని