తడబడుతోంది ..జీవన చక్రం !
logo
Published : 12/06/2021 05:29 IST

తడబడుతోంది ..జీవన చక్రం !

ఇంటికే పరిమితమైన ట్యాక్సీలు 

ఆటో చోదకులదీ అదే దారి

ఈనాడు డిజిటల్, అనంతపురం : కరోనా దెబ్బతో ఆటో డ్రైవర్ల జీవనం దుర్భరంగా మారింది. ఇంటి బాడుగలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. ఒకప్పుడు రోజంతా కష్టపడి రెండు చేతులా సంపాదించే అద్దె వాహనదారుల జీవితాలు తలకిందులయ్యాయి. కొవిడ్‌ నిబంధనల కారణంగా ప్రజలు తిరిగే సమయం తగ్గిపోవడంతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. దీనికితోడు రోజురోజుకు పెరిగిపోతున్న ఇంధన ధరలు వాహన యజమానుల ఆదాయానికి గండికొడుతున్నాయి. డీజిల్‌ లీటర్‌ ధర రూ.95కు చేరుకోవడంతో ఛార్జీలు, అద్దెలు గిట్టుబాటుకావడం లేదని వాపోతున్నారు. వస్తున్న ఆదాయంలో అత్యధిక శాతం డీజిల్‌కే వెచ్చించాల్సి వస్తోందని, కుటుంబ పోషణ భారంగా మారిందని చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తగ్గిన ప్రయాణం

జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 28 వేల ఆటోలు, మరో 5 వేల అద్దెకార్లు ఉన్నాయి. గతేడాది లాక్‌డౌన్‌తో దాదాపు 8 నెలలపాటు ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కాస్త ఊపిరి పీల్చుకుని, అప్పులు తీరుద్దామనే లోపు రెండో దశ కొవిడ్‌ వారి ఆశలపై నీళ్లు చల్లింది. వైరస్‌ కట్టడిలో భాగంగా మొన్నటి వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే ప్రజలు తిరిగేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో జనం ప్రయాణాలు తగ్గించేశారు. బయటకు వచ్చినా ఆటోలు ఎక్కడానికి భయపడుతున్నారు. ప్యాసింజర్‌ ఆటో డ్రైవర్ల ఆదాయం గతంలో రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటే.. ప్రస్తుతం రూ.200 మించి రావడం లేదు. ట్యాక్సీలకు గతంలో నెలలో కనీసం వారంరోజులు బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి వంటి ప్రాంతాలకు గిరాకీలు వచ్చేవి. ఇప్పుడు వారంతా పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. అద్దెకు తెచ్చి నడిపేవారు మరింత దయనీయ స్థితిలో ఉన్నారు.  ఆటో ట్రాలీ కార్మికుల ఆదాయం సగానికి పైగా తగ్గింది. 

కంతులు చెల్లించలేక..

రెండోదశ కరోనా కారణంగా మే 5 నుంచి పగలు కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. నిబంధనలు విధించి ఇప్పటికి 38 రోజులైంది. ఇన్ని రోజులుగా ఆటోలు సక్రమంగా నడవలేదు. ట్యాక్సీలు ఇంటికే పరిమితమయ్యాయి. వీటి యజమానులు, చోదకుల కుటుంబం గడవటమే కష్టమైన పరిస్థితుల్లో ఫైనాన్స్‌ సంస్థలు, బ్యాంకుల నుంచి తెచ్చిన రుణ వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. వాహనాలు తిరిగినా, తిరగకపోయినా తమకు సంబంధం లేదని, వాయిదాలు మాత్రం చెల్లించాల్సిందేనని ఫైనాన్స్‌ సంస్థలు ఒత్తిడి చేస్తుండటంతో మానసికంగా కుంగిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కూడా మారటోరియం ప్రకటించాలని కోరుతున్నారు. 

కొందరికే సాయం

ఆటో, క్యాబ్‌ డ్రైవర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద ఏటా ఒక్కొక్కరికి రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తోంది. అయితే నిబంధనల కారణంగా అది అందరికీ దక్కడం లేదు. జిల్లాలో 28 వేల ఆటోలు, 5 వేల అద్దెకార్లు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గతేడాది 12,120 మందికి మాత్రమే సాయం అందజేశారు. సొంత వాహనాలు ఉన్నవారికి మాత్రమే చేయూత అందించారు. జిల్లాలో చాలామంది ఆటోలను అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. అలాంటివారు 14 వేల మంది ఉంటారని అంచనా. వీరందరికీ ప్రభుత్వ సాయం అందలేదు. ఈ ఏడాది 14,202 దరఖాస్తులు వచ్చాయి. నిబంధనలు సడలించి తమను ఆదుకోవాలని ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

వాయిదాలు చెల్లించలేకపోతున్నా - నాగార్జున, ఆటో డ్రైవర్, ధర్మవరం

ధర్మవరం పట్టణం: కరోనాతో గిరాకీ పూర్తిగా తగ్గిపోయింది. దీనికితోడు డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధర్మవరం నుంచి బత్తలపల్లికి ఆటో నడిపితే రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు వచ్చేది. కుటుంబ పోషణ సాఫీగా సాగేది. ఇప్పుడు రూ.200 కూడా రావడం లేదు. ఇంత తక్కువతో కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావడం లేదు. రుణ వాయిదాలు చెల్లించలేక తీవ్ర అవస్థలు పడుతున్నా. 

ఖాళీ జేబుతో ఇంటికి..ఖాళీ జేబుతో ఇంటికి.. - దేవా, ఆటో డ్రైవర్, కదిరి

కదిరి: కర్ఫ్యూ కారణంగా కొన్ని గంటలు మాత్రమే తిరగాల్సి వస్తోంది. కదిరి పట్టణంలో వెయ్యికి పైగా ఆటోలు ఉన్నాయి. వైరస్‌ భయంతో జనాలు ఆటోలు ఎక్కడం లేదు. గతంలో రోజుకు రూ.వెయ్యి దాకా గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు రూ.200 మించి రావడం లేదు. అదికూడా డీజిల్‌కే సరిపోతోంది. ఇంటికి ఖాళీ జేబుతో వెళ్తున్నాం. 

భారంగా కుటుంబ పోషణ - సయ్యద్, ఆటో డ్రైవర్, కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం గ్రామీణం: పాతికేళ్లుగా ఆటో నడుపుతున్నా. తద్వారా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నా. కరోనా కారణంగా ప్రయాణాలు తగ్గిపోయాయి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గతంలో రోజుకు రూ.500 నుంచి రూ.750 వరకు మిగిలేది. ప్రస్తుతం రూ.150 కూడా రావడం లేదు. ప్రజలు ఆటో ఎక్కాలంటేనే భయపడుతున్నారు. కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.

ఇంటికే పరిమితం - కుమార్, ట్యాక్సీ డ్రైవర్, అనంతపురం 

అనంత సాంస్కృతికం: కరోనాతో అద్దె వాహనాలు నడిపే వారి పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో నెలలో కనీసం పది రోజులు బెంగళూరుకు గిరాకీలు వచ్చేవి. స్థానికంగా కూడా నడిపితే నెలకు రూ.30 వేల దాకా మిగిలేది. వాయిదాలకు రూ.15 వేలు పోగా మిగిలిన దాంతో ఇళ్లు గడిచేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 26 రోజులుగా వాహనం ఇంటికే పరిమితమైంది. వాయిదాలు చెల్లించాలని ఫైనాన్స్‌ సంస్థలు వెంటపడుతున్నాయి. దీంతో మానసికంగా కుంగిపోతున్నా.  

జిల్లాలో ఇదీ లెక్క

ప్యాసింజర్‌ ఆటోలు : 28,000

అద్దె కార్లు: 5,000

వాహనమిత్ర లబ్ధిదారులు: 12,120

ఈ ఏడాది దరఖాస్తులు: 14,202 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని