అనంతను ప్రగతి పథంలో నడిపిస్తా
logo
Published : 12/06/2021 05:29 IST

అనంతను ప్రగతి పథంలో నడిపిస్తా

అందరి సహకారంతో పథకాల అమలు

నూతన కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ‘అనంత జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే నా ఆకాంక్ష. అందరి సహకారంతో ముందుకు వెళ్తానని’ నూతన కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ పేర్కొన్నారు. తొలిసారిగా అనంతపురం కలెక్టర్‌గా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా పరిపాలనా భవనంలోని తన ఛాంబర్‌కు చేరుకున్నారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గంధం చంద్రుడు కొత్త కలెక్టర్‌ నాగలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా చిన్నసమావేశ మందిరంలో మీడియాతో కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులంతా పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా వేళ జాగ్రత్త

కరోనా రెండో దశ కొంచెం తగ్గినప్పటికీ జిల్లా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అనుసరిస్తూ ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. కరోనా సమయంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. 

కలెక్టర్‌కు ఘన స్వాగతం 

కొత్త కలెక్టర్‌ నాగలక్ష్మి శనివారం ఉదయం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జేసీలు నిశాంత్‌కుమార్, సిరి, గంగాధర్‌గౌడ్, నిషాంతి, శిక్షణ కలెక్టర్‌ సూర్యతేజ, డీఆర్వో గాయత్రీదేవి, పరిపాలనాధికారి విజయలక్ష్మి కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడే పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కొత్త కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించి గంధం చంద్రుడు రిలీవ్‌ అయ్యారు. 

దస్త్రాలన్నీ ఈ-ఆఫీస్‌లోనే.. 

జిల్లా అధికారులంతా దస్త్రాలను ఈ-ఆఫీసు ద్వారానే పంపాలి. కాగితాల దస్త్రాలు ఆమోదించేదిలేదని కలెక్టరు తెలిపారు. ఈ-ఆఫీసులో ఫైళ్లను జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి సంబంధిత స్పష్టమైన రిమార్కులతో తన అనుమతి కోసం పంపాలన్నారు. పంపిన ఫైళ్లు ఏదశలో ఉన్నాయో ఆశాఖ అధికారులు తెలుసుకోవాలని సూచించారు.  తన అనుమతి కోసం చివరి నిమిషాల్లో ఫైళ్లను పంపరాదన్నారు. అలా పంపే దస్త్రాలను ఆమోదించేది లేదన్నారు. 

అప్రమత్తంగా ఉండాలి

జిల్లా పరిషత్తు: కొవిడ్‌పై నోడల్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ తెలిపారు. జడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ను నోడల్‌ అధికారులు తేలిగ్గా తీసుకోవద్దన్నారు. కొవిడ్‌ ఆసుపత్రులు, పడకలు, ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సినేషన్, తాత్కాలిక ఆసుపత్రుల గురించి ఆరా తీశారు. మెడికల్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ ఆక్సిజన్‌ నిల్వలు, సరఫరాపై జేసీ నిశాంత్‌కుమార్‌ వివరించారు. ప్రస్తుతం జిల్లాలో కేసులు, మరణాలపై జేసీ సిరి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కొవిడ్‌ ఔషధాల బ్లాక్‌ మార్కెటింగ్, ఆరోగ్యశ్రీ సమస్యలపై తెలుసుకున్నారు. 

మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని