తప్పుచేస్తే చర్యలు తప్పవు
logo
Published : 12/06/2021 04:39 IST

తప్పుచేస్తే చర్యలు తప్పవు

సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డీఆర్‌ ఉమామహేశ్వరి

 

బుక్కపట్నం, న్యూస్‌టుడే : తప్పు చేస్తే ఎలాంటి వారైనా చర్యలు తప్పవని, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడమే తమ లక్ష్యమని హిందూపురం జిల్లా రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరి పేర్కొన్నారు. బుక్కపట్నం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెండునెలలుగా కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ఏవైనా ప్రభుత్వ భూములు రిజిస్టర్‌ చేశారా అన్న అంశం కూడా ఆరా తీశారు.

 

తరలివచ్చిన క్రయవిక్రయదారులు

ఉన్నతాధికారి వచ్చారని తెలియగానే పెద్ద సంఖ్యలో క్రయవిక్రయదారులు కార్యాలయం వద్దకు వచ్చారు. రెండు నెలలుగా నిత్యం వచ్చి వెళుతున్నామని, రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని, ప్రతిరోజూ సర్వర్‌ పనిచేయలేదని చెబుతున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే ఈసీల నకళ్లకు అధిక మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె దృష్టికి తెచ్చారు. ఈ విషయమై సరిగా సమాధానం చెప్పకపోవడంతో సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నిత్యం కాలయాపన చేయడం పరిపాటేనని క్రయవిక్రయదారులు ఆరోపించారు. దీనిపై సంజాయిషీ తెలపాలని సిబ్బందిని ఆదేశించారు.. అనంతరం రెండునెలలుగా స్టాంపులు కార్యాలయంలో విక్రయించడంలేదని దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎక్కువ మొత్తం చెల్లించి తెచ్చుకుంటున్నామని ఫిర్యాదు చేయగా, కావాల్సినన్ని స్టాంపులున్నా ఎందుకు విక్రయించడంలేదని మండిపడ్డారు. వెంటనే స్టాంపులు బయటకు తీసి విక్రయించాలని ఆదేశించారు. డాక్యుమెంట్‌ రైటర్లు ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తున్నారని, అదేమంటే కార్యాలయంలో ఇవ్వాలని చెబుతున్నారని పలువురు రాతపూర్వకంగా డీఆర్‌కు ఫిర్యాదు చేశారు. డబ్బు ఇస్తేనే పనులు జరుగుతున్నాయంటూ నిరసన వ్యక్తం చేశారు. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి వారి ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా రిజిస్ట్రార్‌ తెలిపారు. అనంతరం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించగా గత నెలరోజుల్లో ఎన్నడూ లేని విధంగా 23 దస్తావేజులు రిజిస్టర్‌ చేశారు.

అధిక వసూళ్లపై ఫిర్యాదు

బుక్కపట్నం గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు గోపి, కుమార్‌ డీఆర్‌కు పలు అంశాలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒక వివాహ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.220 రుసుం కాగా రూ.వెయ్యి తీసుకున్నారని రసీదు అడిగితే బుక్‌ అయిపోయిందని సమాధానం చెప్పారు. అది కూడా 3గంటలసేపు వేచి ఉండి చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. అలాగే ఈసీ నకలుకు రూ.225 వసూలు చేయాల్సి ఉండగా రూ.900 వసూలు చేశారని ఉపాధ్యాయుడు కుమార్‌ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఇదే సందర్బంలో ఒక ప్రైవేటు వ్యక్తి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కంప్యూటర్‌లో నమోదు చేస్తుండగా పలువురు డీఆర్‌ దృష్టికి తీసుకురాగా వెంటనే ఆమె సిబ్బందిపై మండిపడి తక్షణం అతనిని పంపించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు కేవలం 2గంటల సేపే పనిచేశాయి. ఆమె వెళ్లగానే తిరిగి అదే వ్యక్తి వచ్చి కార్యకలాపాలు కొనసాగించడం గమనార్హం.

సిబ్బందిపై విచారిస్తాం

ప్రజల నుంచి పలు అంశాలపై ఫిర్యాదులందాయి. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటాం. - జిల్లా రిజిస్ట్రార్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని