ఆగిన ధాన్యం లారీలు..
logo
Published : 12/06/2021 04:39 IST

ఆగిన ధాన్యం లారీలు..

ఆందోళనతో అన్నదాతలు


చిత్తూరు జిల్లా తొట్టెంబేడులో రైస్‌మిల్లుల వద్ద నిలిచిన లారీలు

బొమ్మనహాళ్‌, కణేకల్లు, న్యూస్‌టుడే: కొనుగోలుకేంద్రం నుంచి వరిధాన్యం బస్తాలతో చిత్తూరు జిల్లాలోని వివిధ మిల్లులకు వెళ్లిన లారీల నుంచి బస్తాలను దించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కణేకల్లు, బొమ్మనహాళ్‌ మండలాల నుంచి ఐదు రోజులుగా 30 లారీల వరకు ఆ జిల్లాలోకి శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతికి వెళ్లాయి. మిల్లర్లు బస్తాలను దించుకోకపోవడంతో వాహన యజమానులు సంబంధిత రైతులకు సమాచారం అందించారు. కొంతమంది మిలర్లు రైతులతో నేరుగా చరవాణి ద్వారా మాట్లాడుతూ ధాన్యాన్ని తిరస్కరిస్తున్నామని, వెనక్కి తీసుకెళ్లమని చెబుతున్నారు. ఇంకొందరు లారీకి రూ.30వేల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం టన్నుకు రూ.1,200 రవాణా ఖర్చులు ఇవ్వగా లారీ యజమానులు గిట్టుబాటు కాదనటంతో రైతులు అదనంగా రూ.200 ఇస్తున్నారు. తూకం, లోడింగ్‌ ఖర్చుల నిమిత్తం బస్తాకు రూ.30 చెల్లిస్తున్నారు. మట్టిపెళ్లలు, తాలు ఉందని క్వింటాల్‌కు 5 కిలోల వరకు కొనుగోలుకేంద్రం వద్ద తరుగు తీస్తున్నారని రైతులు తెలిపారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. మిల్లుల వద్ద డబ్బులు డిమాండ్‌ చేసిన విషయాన్ని చిత్తూరు జిల్లా పౌరసరఫరాల మేనేజరుకు తెలిపినట్లు ఇక్కడి పౌరసరఫరాల జిల్లా మేనేజరు కొండయ్య పేర్కొన్నారు. మిల్లులకు చేరిన ధాన్యం రైతులకు ఇబ్బంది కలగకుండా సాంకేతిక సహాయకుడితో నాణ్యతను పరిశీలించి, అన్‌లోడ్‌ చేయించేలా చొరవ తీసుకోవాలని చెప్పామన్నారు. రైస్‌మిల్లర్లు డబ్బులు డిమాండ్‌ చేయడంపై పూర్తి స్థాయిలో విచారించి నివేదించాల్సిందిగా సూచనలు చేశామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని