మళ్లీ ఆశలు చిగురించె!
logo
Published : 12/06/2021 04:39 IST

మళ్లీ ఆశలు చిగురించె!

2008 డీఎస్సీ అభ్యర్థులకు ఊరట

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: గతంలో తీసుకున్న నిర్ణయంతో నష్టపోయిన డీఎస్సీ అభ్యర్థులకు ఉపశమనం కల్గించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాస్తవానికి గతేడాది మే 16వ తేదీన 2008 డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థులకు మినిమమ్‌ టైంస్కేలుతో ఎస్జీటీలుగా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఈ మేరకు జిల్లా నుంచి వివరాలు పంపారు. అప్పట్నుంచి కరోనా, ఇతర కారణాలతో పాఠశాలలు సక్రమంగా జరగలేదు. దీంతో ఆ ప్రక్రియ తెరమరుగైంది. తాజాగా కదలిక రావడంతో ఆశావహుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

ఇదీ నేపథ్యం: 2008 డీఎస్సీలో బీఈడీ, డీఈడీ అర్హత కలిగిన వారికి 70 శాతం, డీఈడీ అర్హత వారికి 30 శాతం పోస్టులు నిర్ణయించి రెండు రోస్టర్లు విడుదల చేశారు. దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందని బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఒకే రోస్టర్‌ ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో అధికారులు వివరాలు సేకరించారు. జిల్లాలో 641 మంది అభ్యర్థులు అర్హత జాబితాలో ఉన్నారని, వారంతా నష్టపోయారని ప్రాథమికంగా తేల్చి, విద్యాశాఖ కమిషనరు కార్యాలయానికి నివేదించారు.

మిగిలింది 245 మందే..

ఏకంగా 13 ఏళ్లపాటు పోరాటం చేశారు. అర్హత సాధించిన కొందరు తదనంతరం జరిగిన డీఎస్సీల్లో ఉద్యోగాలు పొందడం, మరికొందరు అప్పట్లోనే పాఠశాల సహాయకులుగా ఎంపిక కావడం, ఇతరత్రా ఉద్యోగాల్లో చేరారు. మినిమమ్‌ టైంస్కేలుతో ఎస్జీటీలుగా అవకాశం కల్పిస్తామని చెప్పడంతో పలువురు అంగీకారం ఇవ్వలేదు. జిల్లాలో 641 మంది జాబితాలో ఉండగా.. 245 మందే అంగీకారం తెలిపారు. శుక్రవారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,193 మంది ఉండగా అనంతలో 245 మందికి ఎస్జీటీలుగా అవకాశం లభించనుంది. దీంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని