Published : 14/05/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊపిరి పీల్చుకున్నారు!

మూడు రోజుల ఉత్కంఠకు తెర

15 కేఎల్‌ అదనంగా సరఫరా

సర్వజనాస్పత్రి లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకును భర్తీ చేస్తున్న సిబ్బంది  

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే:  మూడు రోజుల అత్యంత ఉత్కంఠకు తెర పడింది. వ΄డు ఆస్పత్రుల్లోనూ నిండుగా ఆక్సిజన్‌ నిల్వలు ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం ‘ఊపిరి’ పీల్చుకుంది. ఆక్సిజన్‌ నిల్వలు నానాటికి తగ్గిపోవడంతో జిల్లా అధికారులు నానా హైరానా పడ్డారు. ఒకే రోజు రెండు ట్యాంకులు జిల్లాకు చేరడంతో అధికారుల్లో ఆందోళన తగ్గింది. రుయా ఆసుపత్రి ఘటన తర్వాత జిల్లాలో అన్ని ఆసుపత్రుల ఆక్సిజన్‌ నిల్వలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ క్రమంలోనే సర్వజనాసుపత్రి, సూపర్‌ స్పెషాల్టీ ఆసుపత్రి, క్యాన్సర్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ నిల్వలపై గుబులు రేగింది. ఆశించిన స్థాయిలో నిల్వలు లేకపోవడంతో జిల్లా యంత్రాంగంలో అలజడి ఆరంభమైంది. ఈ సమస్య రుయా ఆసుపత్రి ఘటన మరుసటి రోజు(11న) నుంచే తలెత్తింది. ఆ రోజు సూపర్‌ స్పెషాల్టీ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ నిల్వలు పూర్తిగా ఖాళీ దశకు చేరుకున్నాయి. అధికారులు సత్వరమే గుర్తించడంతో ప్రత్యామ్నాయంగా సర్వజనాస్పత్రి, క్యాన్సర్‌ ఆసుపత్రి లిక్విడ్‌ ట్యాంకుల్లో నుంచి ఒక్కొక్క కేఎల్‌ చొప్పున తీసుకెళ్లి నింపారు. ఆ రోజు నుంచి ఆశించిన మేర నిల్వలు ఉండటం లేదు. బుధవారం(12న) అయితే పూర్తి కొరత తలెత్తే పరిస్థితి ఏర్పడింది. జిందాల్‌ కంపెనీ నుంచి ప్రత్యేక ట్యాంకర్‌ రాలేదు. ఈలోపు ఆక్సిజన్‌ నిల్వలు పూర్తయితే ప్రత్యామ్నాయంగా సిలిండర్లను సిద్ధం చేశారు. సర్వజన ఆసుపత్రిలో 350పైచిలుకు సిలిండర్లు సిద్ధంగా ఉంచారు. అదృష్టవశాత్తు ఏ సమస్య ప్రస్పుటం కాలేదు. 

వినియోగం రెట్టింపు.. 

బళ్లారి సమీపంలోని జిందాల్‌ కంపెనీ నుంచి రోజూ 16 కేఎల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ మాత్రమే జిల్లాకు ఇండెంట్‌ ఉండేది. ఇంతకు మించి ఇచ్చే పరిస్థితి లేదు. కాని.. సర్వజనాస్పత్రి, క్యాన్సర్, సూపర్‌స్పెషాల్టీ ఆసుపత్రిలో రోజు వారి వినియోగం రెట్టింపు అవుతోంది. ఈ వ΄డింటిలో గంటకు 1.296 కిలో లీటర్లు(కేఎల్‌) ఖర్చు అవుతోంది. ఈ వ΄డు చోట్లా ట్యాంకులు పూర్తిగా భర్తీ లేవు. అరకొర నిల్వలే ఉన్నాయి. బుధవారం ఒక ట్యాంకులో 16 కేఎల్‌ ఆక్సిజన్‌ వచ్చింది. ఇందులో నుంచి సర్వజనాసుపత్రిలో కేవలం 5 కేఎల్‌ మాత్రమే నింపారు. ఇది పది గంటలే వస్తుంది. అందుకే సిలిండర్లను సిద్ధం చేశారు. ఎంపీ రంగయ్య, కలెక్టర్‌ గంధం చంద్రుడు కర్ణాటక ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలోని పరిస్థితిని వివరించారు. కర్ణాటక అధికారులు జిందాల్‌ కంపెనీకి ఫోన్‌ వెళ్లడంతో అదనంగా 15 కేఎల్‌ ట్యాంకర్‌ను జిల్లాకు పంపారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. యథాప్రకారం గురువారం మరో ట్యాంకు 16 కేఎల్‌ సామర్థ్యంతో వచ్చింది.

అందుబాటులో ప్రాణవాయువు

ప్రస్తుతం నిర్దేశిత మూడు ఆసుపత్రుల్లో ఉన్న ప్లాంట్లల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ నిండుగా ఉంది. సర్వజన, సూపర్‌ స్పెషాలిటీలో 13 కేఎల్‌ సామర్థ్యం చొప్పున, క్యాన్సర్‌ ఆసుపత్రిలో 6 కేఎల్‌ సామర్థ్యం ఉంది. ఈ మూడు చోట్లా ట్యాంకులు నిండుగా ఉన్నాయి. గురువారం క్రమంగా వచ్చే ట్యాంకర్‌ వచ్చింది. ఒక్క సర్వజనాస్పత్రిలోనే 11 కేఎల్‌ నింపారు. సూపర్‌ స్పెషాలిటీ ట్యాంకు కూడా నిండుగా ఉంది. మూడు చోట్లా ఆక్సిజన్‌ నిల్వలు ఆశించిన మేర ఉండటంతో శుక్రవారం ఉదయం మరో ట్యాంకరు రానుంది. అన్ని ట్యాంకులూ భర్తీ చేయనున్నారు.

రోగుల చేరికపై సందిగ్ధం

జిల్లా కేంద్రంలోని కీలక మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలపై ఉత్కంఠ నెలకొనడంతో రోగుల చేరికపై తర్జనభర్జన పడ్డారు. బుధవారం నుంచి రోగుల ప్రవేశాలను తగ్గించినట్లు తెలుస్తోంది. తీవ్ర విషమంగా ఉన్న వారిని మాత్రమే చేర్చుకున్నట్లు సమాచారం. ఈ మూడు ఆసుపత్రుల్లో సుమారు 150కిపైగా ఆక్సిజన్‌ పడకలు ఉన్నా రోగులను చేర్చలేదు. దీనికి ఆక్సిజన్‌ నిల్వలు ఆశించిన మేర లేకపోవడమే కారణం. బుధవారం జిల్లా అధికారిక నివేదికలో మాత్రమే ఐసీయూ, ఆక్సిజన్‌ పడకలు సున్నా, సాధారణ పడకలు కొన్ని ఉన్నాయని చెప్పారు. గురువారం నివేదిక ప్రకారం చూస్తే... ఐసీయూ సున్నా, ఆక్సిజన్‌ పడకలు నాలుగు, సాధారణ పడకలు 688 ప్రకారం ఉన్నట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని