Published : 14/05/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరిహారం ఏమాయే..!

● భారంగా కుటుంబాల జీవనం

● విద్యుత్తు ప్రమాద బాధితుల ఆవేదన

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు తీగలు

ముదిగుబ్బ, ఓబుళదేవరచెరువు, న్యూస్‌టుడే; ఏటా విద్యుత్తు ప్రమాదాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. పొలాల్లోనూ, ఇళ్లమీద ప్రమాదకరంగా వెళ్లిన విద్యుత్తు తీగలే మరణ ద్వారాలవుతున్నాయి. రెక్కాడితేకానీ డొక్కాడని పేద కుటుంబాల్లో ఆనందాన్ని చిదిమేసి విషాదాన్ని నింపుతున్నాయి. కుటుంబ పెద్దలు ప్రమాదవశాత్తు మృతిచెందడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. విద్యుత్తు శాఖ తరపున పరిహారం అందిస్తున్నా అందులో తీవ్ర జాప్యం నెలకొని, కుటుంబాలు కష్టాలకు ఎదురీదుతున్నాయి. ఒక్క కదిరి డివిజన్‌లో 2020 జనవరి నుంచి డిసెంబరు వరకు మొత్తం ఏడుగురు మృతి చెందగా అందులో ఏ ఒక్కరికీ పరిహారం అందకపోవడంతో ఆ కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి..

2020 ఫిబ్రవరిలో ముదిగుబ్బలో ఇంటర్మీడియట్‌ చదివే శ్రీకాంత్‌ అనే విద్యార్థి ఇంటిమీద లాగిన విద్యుత్తుతీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కడే కుమారుడు కాగా అల్లారుముద్దుగా పెంచుకుని ఉన్నతచదువులు చదివించాలని గంపెడాశలు పెట్టుకున్న తల్లిదండ్రులకి చివరికి కన్నీరే మిగిలింది.

ఓబుళదేవరచెరువు మండలం కొండకమర్లలో గత ఏడాది ఏప్రిల్‌లో రఫి బేల్దారి పనిచేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి మృతి చెందాడు. కుటుంబానికి పెద్దదిక్కు చనిపోవడంతో ముగ్గురు ఆడపిల్లలను చదివించేందుకు ఆర్థిక స్థోమత లేక కుటుంబం కష్టాలపాలయింది.

ఇటీవల తలుపుల మండలం చిన్నపల్లిలో పొలంలో విద్యుదాఘాతంతో డిగ్రీ చదువుతున్న విద్యార్థి కిరణ్‌కుమార్‌, మేనమామ లక్ష్మీనారాయణ మరణించారు. ఒకేసారి ఇద్దరు మృతి చెందిన ఘటన పలువురిని కలిచివేసింది. విద్యార్థి ఉజ్వల భవిష్యత్తును విధి కల్లలు చేసింది.

అప్రమత్తత ఎంతో అవసరం..

పొలాల్లో రక్షణకోసం ఏర్పాటు చేసే కంచె, ప్రమాదకరంగా మారిన తీగలు తగిలి ఎక్కువగా రైతులే చనిపోతున్నారు. బాధిత కుటుంబాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవగాహనలేక నేటికీ పరిహారం అందని ద్రాక్షగా మారింది.

ఈమె పేరు రాధమ్మ. వ్యవసాయం చేసుకుంటూ భార్య,భర్త ఇద్దరు పిల్లలతో ఆనందంగా సాగిపోతున్న కుటుంబంలో విధి తీరని శోకం మిగిల్చింది. భర్త నరసింహులు పొలంలో విద్యుదాఘాతానికి గురై ఐదేళ్లక్రితం మరణించాడు. పరిహారం కోసం స్థానిక విద్యుత్తు కార్యాలయంలో దరఖాస్తు చేసినా నేటికీ పరిహారం అందక ఎదురుచూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టగా కష్టపడైనా కన్న బిడ్డలను చదివించుకోవాలన్న పట్టుదలతో కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పరిహారం వస్తే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ జీవించవచ్చని కన్నీటితో అభ్యర్థిస్తోంది..

ఈమె పేరు అన్నపూర్ణ. పెళ్లయిన ఆరు సంవత్సరాలకే భర్త సోమశేఖర్‌ విద్యుత్తు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటికే నాలుగేళ్ల కూతురు, కుమారుడు ఉన్నారు. రెండేళ్లు గడుస్తున్నా విద్యుత్తు శాఖ నుంచి నేటికీ సాయం అందకపోవడంతో అధికారుల చుట్టూ తిరిగినా స్పష్టమైన సమాధానం రాలేదు. నిరుపేద కుటుంబం కావడంతో కూలిపనికెళ్తే కానీ పూట గడవని పరిస్థితి. అత్త, మామ అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ భారం మరింత పెరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిహారం ఇవ్వాలని ఆమె వేడుకుంటోంది.

నిబంధనల మేరకే పరిహారం మంజూరు

ప్రమాదాల్లో మృతిచెందిన వారి నివేదికలు వెంటనే ఉన్నతాధికారులకు పంపుతున్నాం. వారి పరిశీలనలో నిబంధనల మేరకే పరిహారం మంజూరవుతోంది. దరఖాస్తులో తప్పిదాలు, నిధుల సమస్య తదితర కారణాలతో మిగిలిన వాటికి పరిహారం మంజూరులో ఆలస్యం జరుగుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిహారం మంజూరయ్యేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటాం. - మోసెస్‌, విద్యుత్తుశాఖ డీఈ, కదిరి

గత ఏడాది నుంచి ఇప్పటి వరకు మృతులు: 22 మంది

పరిహారం పొందిన వారు : 05

అందాల్సిన పరిహారం: రూ.85 లక్షలు

చనిపోయిన పశువులు : 09

పరిహారం అందినది : 05

అందాల్సిన పరిహారం: రూ.1.60 లక్షలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని