Published : 14/05/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నమోదు చేసుకొన్న ప్రతిరైతు ధాన్యం కొంటాం


నాణ్యతను పరిశీలిస్తున్న పౌరసరఫరాల జిల్లా మేనేజరు కొండయ్య

కణేకల్లు, న్యూస్‌టుడే: ఆర్‌బీకేలలో పేరు నమోదు చేసుకొన్న ప్రతి రైతు ధాన్యాన్ని టోకెన్‌ ఆధారంగా నేరుగా కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల జిల్లా మేనేజరు కొండయ్య తెలిపారు. గురువారం కణేకల్లులో ఆయన వరి కొనుగోళ్లను, ధాన్యం రాసులను పౌరసరఫరాల జిల్లా సహాయ మేనేజరు అశ్వర్థనాయక్‌తో కలసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలోలా సొసైటీ నిర్వహణలో కాకుండా ఈసారి పౌరసఫరాల ఆధ్వర్యంలో నేరుగా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్‌లో కణేకల్లు, బొమ్మనహాళ్‌, డి.హీరేహాళ్‌ తదితర మండలాల్లో 16వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలు ధాన్యం మద్దతు ధర ఏగ్రేడు రూ.1,888, కామన్‌ రకం రూ.1,868 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 2,500 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. చౌకదుకాణాల నుంచి, మిల్లర్ల నుంచి గోనెసంచులు తెప్పించి రైతులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకొంటున్నామన్నారు. రైతులే సంచులు కొనుగోలు చేసినా ఒక్కోదానికి రూ.16 వంతున ధాన్యం సొమ్ముతో పాటు రైతు ఖాతాలో జమ చేస్తామని వివరించారు. సూచించిన నాణ్యతా ప్రమాణాల మేరకు ధాన్యం ఆరబెట్టి సిద్ధం చేసుకోవాలని, క్రమపద్ధతిలో అందరి నుంచి కొనుగోలు చేస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని