Published : 14/05/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2,080 మందికి కరోనా

ముగ్గురు మృత్యువాత

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా మరో 2,080 మందికి కరోనా సోకింది. వీరిలో ముగ్గురు మృతి చెందారు. ఈ వివరాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది. మొత్తం 5,827 మంది నుంచి నమూనాలు తీసి పరీక్షించారు. వీరిలోనే 2,080 మందిలో వైరస్‌ ఉన్నట్లు తేలింది. ప్రతి వందలో 36 మందిలో వైరస్‌ ఉన్నట్లు పాజిటివిటీ రేటు నమోదైంది. ఇప్పటి దాకా మొత్తం బాధితుల సంఖ్య 1,05,673 మంది అయ్యారు. వీరిలో 90,604 మంది కోలుకున్న వారిలో ఉన్నారు. ఇప్పటిదాకా 746 మంది మృతి చెందగా... తక్కిన 14,323 మంది క్రియాశీల కేసులుగా ఉన్నారు. వీరిలోనూ 2,487 మంది ఆస్పత్రుల్లో వైద్య చికిత్స పొందుతుండగా.. 11,165 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మిగతా 671 మంది సీసీసీ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్క గురువారమే జిల్లావ్యాప్తంగా 2,298 మంది డిశ్ఛార్జి అయ్యారు. పాజిటివ్‌ కేసుల కంటే... డిశ్ఛార్జిలే ఎక్కువ ఉండటం విశేషం. జిల్లావ్యాప్తంగా కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా అనంత నగరంలో 326 నమోదయ్యాయి.

బత్తలపల్లిలో మరో పది మంది..

బత్తలపల్లి: స్థానిక ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరోనా బాధితులు మరో పది మంది మృతి చెందినట్లు గురువారం తహసీల్ధార్‌ ఖతిజున్‌ ఖుఫ్రా తెలిపారు. మృతుల్లో వజ్రకరూరు మండలం ఛాయాపురం వ్యక్తి (58), నార్పల మండలం బొందలవాడకు చెందిన వృద్ధుడు (80), గుంతకల్లు యువతి (27), కుందుర్పి వృద్ధుడు (60), మదనపల్లికి చెందిన వ్యక్తి (55), అనంతపురానికి చెందిన వృద్ధుడు (75), మరో మహిళ (56), మరో వృద్ధురాలు (74), మరో యువకుడు (35). బత్తలపల్లికి చెందిన వృద్ధురాలు (84) ఉన్నట్లు వివరించారు.

ముగ్గురు సబ్‌ రిజిస్ట్రార్లకు... 

అనంత గ్రామీణం (తపోవనం): జిల్లాలోని ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్లకు కరోనా సోకింది. వీరి స్థానంలో బాధ్యతలు అప్పగించిన ఇన్‌ఛార్జిలు రిజిస్ట్రేషన్లు ఆపేశారు. రిజిస్ట్రేషన్లతో పాటు ఇతర పనులు కూడా చేయకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కర్ఫ్యూ కారణంగా రోజులో కేవలం 3.30 గంటలు మాత్రమే కార్యాలయాలు తెరుస్తున్నారు. ఈ సమయంలో అధికారులు ఏపని చేయకుండా అందరినీ వెనక్కి పంపడం వివాదంగా మారింది. బుక్కపట్నం సబ్‌రిజిస్ట్రార్‌ వెంకటనారాయణకు కరోనా సోకడంతో దీర్ఘకాలిక సెలవు పెట్టారు. ఆయన స్థానంలో గౌరమ్మ అనే సీనియర్‌ సహాయకురాలికి బాధ్యతలు అప్పగించారు. వారం రోజుల నుంచి ఆమె అసలు రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. రైతులకు సంబంధించిన ఈసీలు కూడా ఆమోదించలేదు. దీనివల్ల రోజూ వందలమంది కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ధర్మవరం సబ్‌రిజిస్ట్రార్‌ శీనా నాయక్‌కు కూడా కరోనా సోకడంతో సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎవరికీ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించకపోవడంతో ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. ఈ విషయం హిందూపురం రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరి దృష్టికి తీసుకెళ్లడానికి ఉద్యోగులు ప్రయత్నిస్తున్నా ఆమె అందుబాటులో లేరు. ఆమె అసలు విధులకు కూడా హాజరు కాలేదని హిందూపురం వాసులు పేర్కొంటున్నారు. గతంలోనూ ఆమె లాక్‌డౌన్‌ సమయంలో రెండు నెలల పాటు చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరైనట్లు ఉన్నతాధికారులు నిగ్గుతేల్చారు. రోజూ కార్యాలయం తెరుస్తున్నా విధులకు మాత్రం గైర్హాజరైతున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. కదిరి సబ్‌రిజిస్ట్రార్‌ కుమారస్వామిరెడ్డికి కూడా వైరస్‌ సోకింది. ఆయన స్థానంలో అనంతపురంలో ఉన్న సీనియర్‌ సహాయకుడు బసవరాజుకి బాధ్యతలు అప్పగించారు. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు సాగిపోతున్నాయి. దీనిపై రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ మాధవి మాట్లాడుతూ వీటిపై పూర్తి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హిందూపురం రిజిస్ట్రార్‌ ఉమాహేశ్వరిపై గతంలో కూడా ఫిర్యాదులు అందిన విషయం వాస్తవమేనని వివరించారు.

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని