Published : 14/05/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జిల్లాకు ఆక్సిజన్‌ అదనపు కోటా!

మంత్రి బొత్స సత్యనారాయణ

తపోవనం(అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: కరోనా రోగుల అవసరార్థం జిల్లాకు ఆక్సిజన్‌ అదనపు కోటా కేటాయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. కరోనా కట్టడి చేయాలంటే జ్వరాలపై నిరంతరం ఇంటింటా సర్వే చేయాలని ఆయన ఆదేశించారు. కొవిడ్‌ నియంత్రణపై గురువారం జూమ్‌ యాప్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ప్రభుత్వ విప్‌ రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, తిప్పేస్వామి, కలెక్టర్‌ గంధం చంద్రుడు, సంయుక్త కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, సహాయ కలెక్టర్‌ సూర్యతేజ, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. జిల్లా మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యే శమంతకమణి, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి వారి వారి ప్రాంతాల నుంచి సమీక్షలో పాల్గొన్నారు. మంత్రి బొత్స మాట్లాడుతూ.. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో జిల్లాకు మరో ఐదు టన్నుల ఆక్సిజన్‌ అదనంగా కేటాయిస్తామన్నారు. నిల్వల కోసం అవసరమైతే ట్యాంకర్లను లీజు ప్రాతిపదికన తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అంబులెన్సు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అద్దెలు వసూలు చేస్తున్నారని, వారితో సమావేశం నిర్వహించి ఆమోదయోగ్యమైన ధర నిర్దేశించాలని సూచించారు. ఈ విషయంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను బంధువులు తీసుకెళ్లకపోతే గౌరవ ప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలన్నారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. జ్వరాలపై సర్వే తీరును సమీక్షించారు. ప్రతి నాలుగైదు రోజులకు సర్వే చేసి సకాలంలో వైద్యసేవలు అందించాలని సూచించారు.

జూమ్‌ ఆప్‌లో మాట్లాడుతున్న మంత్రి బొత్స, హాజరైన కలెక్టర్‌ గంధం చంద్రుడు,

విప్‌ రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాపు, తిప్పేస్వామి

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని