రెవెన్యూ భూములు మాయం చేస్తున్నారు..!
eenadu telugu news
Published : 24/10/2021 06:21 IST

రెవెన్యూ భూములు మాయం చేస్తున్నారు..!

గురజాల, మాచవరం, న్యూస్‌టుడే: రెవెన్యూ శాఖకు సంబంధించిన ఆన్‌లైన్‌ భూముల వివరాలు మాయం అవుతున్నాయి..! ఆ శాఖ కార్యాలయాల్లో పనిచేసే పొరుగు సేవల సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదాతలు అష్టకష్టాలు పడి భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకుంటే, ఏడాది తిరగకుండానే అవి తొలగిపోతున్నాయి. రైతులు పంట రుణాల కోసం గ్రామ సచివాలయాలు, మీ-సేవా కేంద్రాలకు వెళ్లి అడంగళ్‌, 1బి ఇవ్వమని అడిగితే, ఆన్‌లైన్‌లో కనిపించకపోవడం, కనిపించినా తహశీల్దారు డిజిటల్‌ సంతకం పెండింగ్‌ చూపిస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెంది రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకొని, డిజిటల్‌ ‘కీ’ పెట్టినందుకు మాముళ్ల రూపంలో దండుకుంటున్నారు. కొన్ని చోట్ల అసలు వివరాలే ఉండటం లేదు. కొంతమంది సిబ్బంది చేతి నిండా(డబ్బు) పని ఉండటం లేదని, ఆన్‌లైన్‌లో రైతుల భూమి వివరాలను పెండింగ్‌లో ఉంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్య చాన్నాళ్లుగా ఉంటున్నా, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇలా జరుగుతోందని రైతులు విమర్శిస్తున్నారు. సిబ్బంది మాత్రం దీనిపై కుంటిసాకులు చెబుతూ సమాధానాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. పల్నాడులోని మాచవరం, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, దుర్గి, కారంపూడి, మాచర్ల మండలాలతో పాటు మిగిలిన మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీనిపై ఆర్డీవో పార్థసారథి మాట్లాడుతూ... డిజిటల్‌ ‘కీ’ పెండింగ్‌ చూపించినా, ఆన్‌లైన్‌లో పేరు తొలగినా వెంటనే తహశీల్దారును కలిసి, భూమికి సంబంధించిన పత్రాలు చూపిస్తే వెంటనే నమోదు చేస్తారని చెప్పారు. రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేసే పొరుగు సేవల సిబ్బందిని రైతులు కలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని