నల్లబజారులో పోటాష్‌
eenadu telugu news
Published : 24/10/2021 05:53 IST

నల్లబజారులో పోటాష్‌

ఈనాడు, గుంటూరు


దుకాణంలో నిల్వలు పరిశీలిస్తున్న విజిలెన్స్‌ ఏవో వాసంతి

ప్రస్తుతం వరి పంట కీలకమైన చిరుపొట్ట దశలో ఉన్నందున ఎకరాకు అరబస్తా చొప్పున పొటాష్‌ అవసరం. అయితే మార్కెట్‌లో లభ్యత లేకపోవడంతో రైతులు నిత్యం వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. పొటాష్‌ డిమాండ్‌ను గుర్తించిన వ్యాపారులు నల్లబజారులో గరిష్ఠ చిల్లర ధరపై బస్తాకు రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారు. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం అవసరాల మేరకు పొటాష్‌ అందుబాటులో ఉందని చెబుతున్నా, మార్కెట్‌లో మాత్రం కొరత ఏర్పడింది. ధాన్యం గింజలు నిండుగా ఎదగడానికి, నాణ్యమైన దిగుబడులు రావడానికి పొటాష్‌ ఎరువు ఎంతో కీలకం. కృష్ణా పశ్చిమడెల్టాతో పాటు పల్నాడు ప్రాంతంలోని నకరికల్లు తదితర మండలాల్లో పొటాష్‌ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పొటాష్‌ ప్రస్తుతం 50 కిలోల బస్తా రూ.1050 గరిష్ఠ చిల్లర ధరకు విక్రయించాల్సి ఉంది. వ్యాపారులు డిమాండ్‌ ఉందని చెబుతూ తెలిసిన రైతులకే అధిక ధరకు అమ్ముతున్నారు. పొటాష్‌ ఎరువు ధర పెరుగుతుందన్న కారణంగా రైతులు అవసరాలకు మించి కొందరు నిల్వ చేసుకున్నట్లు సమాచారం. నెల రోజుల తర్వాత అవసరమైనవారు కూడా ముందుగా కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఎరువుకు ప్రత్యామ్నాయంగా మార్కెట్‌లో 10.26.26, 14.35.14 కాంప్లెక్స్‌ ఎరువులు కూడా వేసుకోవచ్చని వ్యవసాయశాఖ సూచిస్తోంది. అయితే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు కూడా అధికంగా ఉండటంతో రైతులు పొటాష్‌ కొనుగోలుకే మొగ్గుచూపుతున్నారు. పొటాష్‌ మొత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంతర్జాతీయంగా డిమాండ్‌ ఏర్పడటంతో ధరలు పెరిగాయి. దీంతో సరఫరా చేసే కంపెనీలు ఆచితూచి తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తుండటంతో అన్ని రాష్ట్రాల్లో కొంత కొరత ఉన్నమాట వాస్తవమేనని ఎరువుల కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు : - ఎం.విజయభారతి, సంయుక్త సంచాలకుడు, వ్యవసాయశాఖ

జిల్లాలో పొటాష్‌ ఎరువు కొరత లేదు. ఆర్బీకేలతోపాటు పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచాం. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధర వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాకు వస్తున్న ఎరువుల్లో 50 శాతం మార్క్‌ఫెడ్‌ ద్వారా సొసైటీలు, ఆర్బీకేలకే కేటాయిస్తున్నాం.

కొనసాగుతున్న కొరత

జిల్లాలో ఇప్పటివరకు 8572 టన్నుల పొటాష్‌ ఎరువు సరఫరా చేశారు. ఎకరాకు అరబస్తా చొప్పున లెక్కిస్తే 3.84 లక్షల ఎకరాలకు సరిపోతుంది. జిల్లాలో 5.25 లక్షల ఎకరాల వరి సాగైంది. అయితే ఇందులో 50 శాతం విస్తీర్ణం మాత్రమే ప్రస్తుతం చిరుపొట్ట దశలో ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఇదే సమయానికి 8వేల టన్నులు మాత్రమే విక్రయించామని, ఈఏడాది ఇప్పటికే 8572 టన్నులు సరఫరా చేశారు. ఆదివారం ఉదయానికి మరో 1100 టన్నులు పొటాష్‌ జిల్లాకు వస్తోంది. ఆర్బీకేల్లో 606 టన్నుల పొటాష్‌ ఎరువు పెట్టగా ఇప్పటివరకు 283 టన్నులు విక్రయించారు. ఇంకా 369 టన్నులు నిల్వలు ఉన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రైతులు పొటాష్‌ కోసం ఆర్బీకేలు, డీసీఎంఎంస్‌ కేంద్రాలు, పీఏసీఎస్‌ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాకు వచ్చిన ఎరువు మొత్తం రైతులకు చేరిందా? వ్యాపారుల వద్ద నిల్వలు ఉన్నాయా? రైతులు అధికంగా కొనుగోలు చేశారా? సాగు విస్తీర్ణంతో పోల్చితే అమ్మకాల్లో తేడాలు ఎందుకున్నాయి? ఇంకా ఎందుకు కొరత ఏర్పడిందన్న వివరాలు వ్యవసాయశాఖ పరిశీలనలో తేలాల్సి ఉంది. జిల్లాలోని టోకు, రిటైల్‌ వ్యాపారుల గోదాములు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.


ఐదు రోజులుగా తిరుగుతున్నా..

- వెంకటనరసింహారావు, రైతు, చింతలపూడి

ఎనిమిది ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. ప్రస్తుతం పంట చిరుపొట్ట దశలో ఉంది. పొటాష్‌ వేయాలని ఐదురోజులుగా పొన్నూరులో ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నా దొరకడం లేదు. ఈరోజు.. రేపు అంటూ వ్యాపారులు చెబుతున్నారు. సకాలంలో వేయకపోతే దిగుబడులపై ప్రభావం ఉంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని