సోలార్‌ పరికరాలు పక్కన పెట్టేశారు
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

సోలార్‌ పరికరాలు పక్కన పెట్టేశారు

విద్యుత్తు కోతల నేపథ్యంలో వినియోగం అవసరం

ముప్పాళ్ల కేజీబీవీలో నిరుపయోగంగా సొలార్‌ ప్యానల్స్‌

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : అప్రకటిత విద్యుత్తు కోతలు గ్రామీణుల్ని ఇబ్బందిపెడుతున్నాయి. సామాన్య ప్రజలు కోతలతో అల్లాడుతుంటే పిల్లల చదువులపై కూడా అవి ప్రభావం చూపిస్తున్నాయి. సాయంత్రం 5.30 గంటల నుంచి 9.30 వరకు విద్యుత్తు కోత విధిస్తే ఆ సమయంలో చదువుకు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీల్లో) విద్యార్థినులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లోనూ విద్యుత్తు కోతలు ఉంటాయని ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందరినీ అప్రమత్తం చేస్తోంది. ముందు చూపు దృష్ట్యా అయిదేళ్ల క్రితమే కేజీబీవీల్లో సూర్యరశ్మిని ఒడిసి పట్టేలా సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాన్ని సద్వినియోగం చేయాల్సిన అధికారులు విద్యుత్తు కోతలు లేవని పక్కనపెట్టేశారు. వాడుకలో లేక అవి నిరుపయోగంగా మారాయి. విద్యుత్తు కోతల నేపథ్యంలో మళ్లీ వాటి వినియోగంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పనిచేయని బ్యాటరీలు

కేజీబీవీల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వసతితో కూడిన విద్యాబోధన ఎప్పటినుంచో అమల్లో ఉంది. కొన్ని కేజీబీవీల్లో ఇంటర్‌ బోధన కూడా జరుగుతోంది. ఒక్కొ తరగతికి 40 మంది చొప్పున విద్యార్థినులు ఉంటారు. విద్యాలయానికి 250 మందికి పైబడి బాలికలు చదువుకుంటున్నారు. వసతితో కూడిన విద్యాబోధన కావడంతో నిరంతరం వాటికి విద్యుత్తు అవసరాలు ఉంటాయి. దీని దృష్ట్యా ఒక్కొక్క కేజీబీవీలో సుమారు రూ.4 లక్షలు విలువచేసే సొలార్‌ పరికరాల్ని గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. 2కేవీ ఇన్‌వర్టర్‌, 20 ప్యానల్స్‌, 150 ఏఎస్‌ బ్యాటరీలు 8 చొప్పున ఏర్పాటు చేశారు. కొంతకాలం అవి బాగానే పనిచేశాయి. నిర్వహణ, పర్యవేక్షణ లేక మూలనపడ్డాయి. సాధారణంగా ఒక్కొక్క కేజీబీవీకి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు వరకు విద్యుత్తు బిల్లు వస్తుంది. అదే సొలార్‌ వినియోగిస్తే రూ.1500 నుంచి రూ.3 వేల లోపు బిల్లు వస్తుంది. విద్యుత్తు ఆదాతోపాటు నిరంతర సరఫరాకు అవకాశం ఉంటుంది. సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ముప్పాళ్ల, నకరికల్లు, రాజుపాలెం, క్రోసూరు, బెల్లంకొండ మండలాల్లో సొలార్‌ పరికరాల్ని కేజీబీవీల్లో ఏర్పాటు చేశారు. ముప్పాళ్లలో ప్యానల్స్‌, ఇన్‌వర్టర్‌ బాగానే ఉండగా బ్యాటరీలు పనిచేయట్లేదు. దీంతో కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. నాడు..నేడు పనుల్లో భాగంగా క్రోసూరు కేజీబీవీలోని సొలార్‌ పరికరాలన్నింటిని తీసేసి వేరేచోట పెట్టారు. మిగిలిన చోట కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి. సొలార్‌ పరికరాల పరిస్థితులపై పర్యవేక్షక అధికారులకు నివేదిక అందించినట్లు కేజీబీవీల ప్రత్యేకాధికారులు ‘న్యూస్‌టుడే’ బృందంతో చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని