ఉత్కంఠకు తెర..
eenadu telugu news
Updated : 17/09/2021 04:51 IST

ఉత్కంఠకు తెర..

ఫలించిన పరిషత్‌ ఎన్నిక అభ్యర్థుల నిరీక్షణ

41 జడ్పీటీసీ స్థానాలకు 159 మంది పోటీ

648 ఎంపీటీసీ స్థానాలకు 1631 మంది

ఈనాడు, అమరావతి


మాంటిస్సోరి కళాశాల ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు కోసం ఖాళీ డబ్బాలు తీసి సిద్ధం చేస్తూ...

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్లను లెక్కించేందుకు న్యాయస్థానం పచ్చజెండా ఊపడంతో పోటీ చేసిన అభ్యర్థుల నిరీక్షణ ఫలించింది. ఏప్రిల్‌ 8న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి బ్యాలెట్‌ పెట్టెలను స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచి ఉంచారు. జిల్లాలోని 46 మండలాలకు చెందిన బ్యాలెట్‌ పెట్టెలను 23 కేంద్రాల్లో భద్రపరిచారు. గత ఐదు నెలలుగా పటిష్ఠ భద్రత మధ్య స్ట్రాంగ్‌ రూంలలో ఉన్నాయి. తాజాగా న్యాయస్థానం ఆదేశాలు వెలువడడంతో స్ట్రాంగ్‌ రూంలలో ఉన్న బ్యాలెట్‌ పెట్టెలను జిల్లా యంత్రాంగం గురువారం పరిశీలించింది. ఓట్ల కౌంటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను ఆరంభించారు. కౌంటింగ్‌కు తేదీ వెలువడిన వెంటనే ప్రక్రియ ఆరంభించేందుకు సన్నద్ధమవుతున్నారు.


స్ట్రాంగ్‌ రూం బయట పోలీసుల కాపలా...

జిల్లాలో మొత్తం 41 మండలాల్లో జడ్పీటీసీ ఎన్నికలు జరగ్గా 159 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 49 మండలాల్లోని 648 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటి కోసం 1631 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 2409 పోలింగ్‌ కేంద్రాల్లో ఏప్రిల్‌ 8న ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 870 సమస్యాత్మక, 624 అత్యంత సమస్యాత్మక కేంద్రాలున్నాయి. ఎన్నికలు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల నాటికి జిల్లాలో మొత్తం ఓటర్లు 20.04లక్షల మందికి పైగా ఉన్నారు. జిల్లాలో 63.99శాతం పోలింగ్‌ నమోదైంది. పోటీ చేసిన అభ్యర్థులంతా గత ఐదు నెలలుగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఎన్నికలను తెదేపా బహిష్కరించడంతో..

పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. గత పరిషత్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తెదేపా బహిష్కరించడం వల్ల జిల్లాలో పోలింగ్‌ శాతం బాగా తగ్గింది. తెదేపా అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ఎక్కడా ప్రచారం పెద్దగా చేయలేదు. తమకు పట్టున్న స్థానాల్లో మాత్రం అక్కడక్కడా అభ్యర్థులు పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ప్రచారం చేసుకున్నారు. పార్టీకి చెందిన పెద్ద నాయకులు ఎవరూ ప్రచారంలో పాల్గొనలేదు. అధికార వైకాపా అభ్యర్థులు మాత్రమే ప్రచారం చేసుకున్నారు. అందుకే అంతకుముందు పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం పోలింగ్‌ నమోదవ్వగా పరిషత్‌ ఎన్నికలకు బాగా తగ్గిపోయింది.


గెలుపు గుర్రాల ఎదురుచూపులు...

జిల్లాలో ఇప్పటికే 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో వైకాపా 67, తెదేపా 2 ఉన్నాయి. జడ్పీటీసీ స్థానాలు కూడా 2 వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు తీర్పు కోసం ఐదు నెలలుగా నిరీక్షిస్తున్నారు. తెదేపా ప్రచారం కూడా చేయకపోవడంతో జిల్లాలో గెలుపు అవకాశాలు అధికార వైకాపా అభ్యర్థులకే అధికంగా ఉన్నాయి. గెలిచేందుకు అవకాశం ఉన్న అభ్యర్థులంతా ఓట్ల లెక్కింపు కోసం ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని