కార్డులిక్కడ.. వారెక్కడ?
eenadu telugu news
Updated : 17/09/2021 05:49 IST

కార్డులిక్కడ.. వారెక్కడ?

రేషన్‌ తీసుకోని వేల మంది కార్డుదారులు

మండలాల్లో అధికారుల పరిశీలన

బోగస్‌ అని తేలితే రద్దు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

ప్రభుత్వ పథకాలు పొందుతున్న అనర్హులను తొలగించే దిశగా చర్యలు చకచకా సాగిపోతున్నాయి. దీనిలో భాగంగా రేషన్‌ కార్డుల్లో కూడా వడపోత మొదలైంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా అధికారులు కార్యాచరణ చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేషన్‌ పొందుతున్నట్లు గుర్తించి వాటిపై విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కార్డులు పొంది.. కొన్ని నెలలుగా రేషన్‌ తీసుకోనివారిపై దృష్టిసారించారు. జిల్లావ్యాప్తంగా అలాంటి కార్డులపై క్షేత్రస్థాయి విచారణ చేసి, బోగస్‌గా తేలితే వాటిని తొలగించే చర్యలు చేపట్టారు.

జిల్లావ్యాప్తంగా 38 వేలకు పైగా కార్డుదారులు ఆరు నెలల నుంచి ఏడాదిలోపు వరకు రేషన్‌ సరకులు తీసుకోవడం లేదు. ప్రస్తుతం పోర్టబులిటీ ద్వారా ఏ ప్రాంతంలో అయినా సరకులు తీసుకునే అవకాశమున్నా.. వేలమంది ఎందుకు తీసుకోవడం లేదనే దానిపై అధికారులు దృష్టిసారించారు. మండలాల వారీగా రేషన్‌ తీసుకోని కార్డుల జాబితాను జిల్లా పౌరసరఫరాల శాఖ అందజేయడంతో రెవెన్యూ ఉద్యోగులు దీనిపై విచారణ ప్రారంభించారు. ప్రతినెలా రేషన్‌ కోసం ఎదురుచూసే పేదలు ఎంతోమంది ఉండగా.. కార్డులు ఉండి కూడా సరుకులు తీసుకోవడం లేదంటే అవి బోగస్‌ కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అదే దిశగా విచారణ వేగవంతం చేశారు. కార్డుదారులు ఉన్నారా.. ఉంటే రేషన్‌ ఎందుకు తీసుకోవడం లేదు.. కార్డులోని సభ్యులందరూ ఆధార్‌ ధ్రువీకరణ చేయించుకోకపోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. జిల్లాలోని కృత్తివెన్ను, కైకలూరు, నాగాయలంక, కోడూరు, బందరు తదితర ప్రాంతాల్లో వలసలు వెళ్లేవారంతా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. విచారణలో మాత్రం బోగస్‌ కార్డులుగా తేలితే వాటిని తొలగిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి.

జిల్లాలో బందరు డివిజన్‌లో 2,080, గుడివాడ 1,312, నూజివీడు 2,473, విజయవాడ డివిజన్‌లో 4,469 మంది ప్రభుత్వ ఉద్యోగులు బియ్యం కార్డుల ద్వారా రేషన్‌ పొందుతున్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కార్డులపై క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు ఆయా డివిజన్‌లలో 4,775 కార్డులు తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన వాటిపై కూడా విచారణ త్వరితగతిన పూర్తిచేసి.. రద్దు చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనే నెలల తరబడి రేషన్‌ తీసుకోని వారిపై దృష్టిసారించారు. బియ్యం కార్డులు పెరుగుతున్నా రేషన్‌ పంపిణీ మాత్రం ప్రతి నెలా 85శాతం నుంచి 90 శాతంలోపే అవుతోంది. వాహనాల ద్వారా ఇళ్లవద్దకే తీసుకువెళుతున్నా.. నూరుశాతం ఎందుకు పూర్తికావడం లేదని ఆరాతీస్తే చాలామంది నెలల తరబడి సరకులు తీసుకోవడం లేదనే విషయం వెల్లడైంది.

జిల్లాలో..

మొత్తం బియ్యం కార్డులు: 13,12,128

ఏడాదిలోపు రేషన్‌ తీసుకోనివారు: 38,788

రేషన్‌ పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు: 10,334

ఇప్పటివరకు తొలగించిన కార్డులు: 4,775


విచారణ జరుగుతోంది

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రేషన్‌ పొందుతున్నట్లు నిర్ధారణ జరిగితే కార్డులను రద్దు చేస్తాం. ప్రస్తుతం కొన్ని నెలలుగా రేషన్‌ తీసుకోని కార్డుదారుల వివరాల సేకరణ ప్రక్రియ జరుగుతోంది. వీటిలో బోగస్‌ కార్డులుంటే వాటిని తొలగిస్తాం. కార్డుదారులుండి రేషన్‌ సరకులు తీసుకోకపోవడానికి సహేతుకమైన కారణం చూపితే కార్డులు కొనసాగుతాయి.

- ఖాజావలీ, ఆర్డీవో, మచిలీపట్నం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని