పోర్టల్‌లో నమోదైతేనే వడ్డీ రాయితీ సొమ్ము
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

పోర్టల్‌లో నమోదైతేనే వడ్డీ రాయితీ సొమ్ము

అన్నదాతలకు ప్రయోజనం

నెలాఖరు వరకు గడువు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

 


గత ఖరీఫ్‌లో సాగు చేసిన వరిపంట

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ రాయితీ మంజూరుకు రైతులు ఈ నెలాఖరులోగా తమ పేర్లు నమోదు చేయించుకోవాలి. వాణిజ్య, సహకార బ్యాంకుల్లో రూ.లక్ష లోపు రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి ఇది వర్తిస్తుంది. 2019 ఖరీఫ్‌లో ప్రభుత్వం వడ్డీ రాయితీ నిధులు విడుదల చేసినా ఎక్కువ మంది కర్షకుల పేర్లు సున్నా వడ్డీ పంట రుణాల (ఎస్వీపీఆర్‌) పోర్టల్‌లో నమోదు చేయక వడ్డీ రాయితీని అందుకోలేకపోయారు.

తాజాగా 2020 ఖరీఫ్‌లో పంట రుణాలు చెల్లించిన అన్నదాతలకు వడ్డీ రాయితీ సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్యాంకు ఉద్యోగులే ఎస్వీపీఆర్‌ పోర్టల్‌లో వడ్డీ సకాలంలో చెల్లించిన రుణ గ్రహీతల పేర్లను నమోదు చేయాలి. కొన్ని బ్యాంకుల్లో వివరాలు నమోదు చేయక వడ్డీ రాయితీని పొందలేకపోతున్నామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019 ఖరీఫ్‌లో వడ్డీతోసహా పంట రుణాలను సకాలంలో బ్యాంకులకు చెల్లించినా వారికి రాయితీ సొమ్ము మంజూరు కాలేదు. బ్యాంకు ఉద్యోగులను సంప్రదిస్తే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని సమాధానం చెబుతున్నారు. రైతుల నుంచి బ్యాంకులు పంట రుణాలపై 7శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వడ్డీని తిరిగి చెల్లించాలి. కేంద్రం 3 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. రూ.3 లక్షల పంట రుణం వరకు 7 శాతం వడ్డీ చెల్లించాలి. రూ.లక్ష లోపు రుణం తీసుకుని చెల్లించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపజేస్తోంది.

గ్రామ స్థాయిలో అవగాహన లోపం

సున్నా వడ్డీ రాయితీ గురించి రైతులకు గ్రామ వ్యవసాయ సహాయకులు అవగాహన కల్పించాలి. బ్యాంకు ఉద్యోగులు సకాలంలో పోర్టల్‌లో పేర్లు నమోదు చేయాలి. అన్నదాతలు బ్యాంకులకు వెళ్లి సున్నా వడ్డీ రాయితీ నమోదు గురించి అడిగే పరిస్థితి కనిపించడం లేదు. వీఏఏలు దీని గురించి పట్టించుకోవడం లేదు. వ్యవసాయశాఖాధికారులు దీనిపై రైతులను చైతన్యం చేయాల్సి ఉంది. 2020 ఖరీఫ్‌లో జిల్లాలో సున్నా వడ్డీ రాయితీకు 41 వేల మంది రైతులు అర్హులుగా ఉన్నారు.


అర్హులందరికీ వడ్డీ రాయితీ మంజూరు

2020 ఖరీఫ్‌లో రూ.లక్ష లోపు పంటరుణం తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు సున్నా వడ్డీ రాయితీ వర్తిస్తుంది. వారి వివరాలను ఆయా బ్యాంకులు ఎస్వీపీఆర్‌ యాప్‌లో నమోదు చేస్తున్నాయి. రైతులు బ్యాంకులకు వెళ్లి సమాచారం తెలుసుకోవాలి. ఈ నెలాఖరుకల్లా అన్ని బ్యాంకుల నుంచి వడ్డీ రాయితీ పొందే కర్షకుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయిస్తాం.

- రామ్మోహనరావు, జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజరు


జిల్లాలో 2019 ఖరీఫ్‌లో రూ.లక్షలోపు రుణం చెల్లించిన రైతులు 71,790

ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ రాయితీ సొమ్ము రూ.15.06 కోట్లు

2019 రబీలో రూ.లక్షలోపు రుణం చెల్లించిన రైతులు 51,089

ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ రాయితీ సొమ్ము రూ.11.18 కోట్లు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని