గంజాయి వెర్రితలలు..
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

గంజాయి వెర్రితలలు..

వాట్సాప్‌లో ఆర్డర్లు, ఇళ్లకే సరఫరా

విక్రయాలపై పోలీసుల దృష్టి

ఈటీవీ, విజయవాడ


హుక్కా తరహాలో సీసాతో తయారు చేసిన పరికరం

పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. నగరంలో మత్తు పదార్థాల సరఫరా యథేచ్ఛగా సాగుతూనే ఉంది. వారి కళ్లుగప్పి రకరకాల మార్గాలను అమ్మకందార్లు ఎంచుకుంటున్నారు. గంజాయి కావాలంటే.. వాట్సాప్‌లో ఆర్డర్‌ ఇస్తే చాలు నేరుగా ఇంటికే పంపిస్తున్నారు. యువతే లక్ష్యంగా చేసుకుని ఇళ్లకే సరఫరా చేస్తున్నారు. తాజాగా పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు కొందరు గంజాయి దందాను ఎంచుకున్నారు. టీస్టాల్‌, ఐస్‌క్రీమ్‌ పార్లర్‌, మొబైల్‌ దుకాణాలు నిర్వహించే కొందరు మత్తు పదార్థాల విక్రేతలుగా మారుతున్నారు. ఇప్పటివరకు విక్రేతల్ని మాత్రమే అరెస్ట్‌ చేసిన పోలీసులు ఇప్పుడు తీసుకునే వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు.

నిఘాకు ఐదు బృందాలు

విజయవాడకు గంజాయిని విశాఖ, నర్సీపట్నం ఏజెన్సీ నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ప్రత్యేక దృష్టి సారించారు. విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫలితంగా 10 రోజుల్లోనే 30 మంది విక్రేతలను అరెస్ట్‌ చేశారు. మత్తు పదార్థాల అమ్మకందారులపై సస్పెక్ట్‌ షీట్‌ తెరిచి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మిగిలిన వారిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కొవిడ్‌ సమయంలో చిరువ్యాపారాలు దెబ్బతినడంతో కొందరు గంజాయి విక్రేతలుగా మారుతున్నారు. తేలికగా డబ్బు సంపాదించాలని గంజాయి వ్యాపారం మొదలుపెట్టారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి రెండు నుంచి ఐదు కిలోల వరకు కొనుగోలు చేసి బ్యాగుల్లో పెట్టుకుని ద్విచక్ర వాహనాలపై తీసుకొస్తున్నారు.

* వాటిని తిరిగి.. చిన్న పొట్లాలుగా చేసి, ఒక్కొక్కటి రూ.100కు విక్రయిస్తున్నారు. కొందరు 30 గ్రాముల ప్యాకెట్లను తయారు చేసి రూ.500కు అమ్ముతున్నారు. కేజీ వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసి, ఇక్కడ రూ.5వేల చొప్పున అమ్ముతున్నారు. గంజాయి వినియోగించే వారి వివరాలను సేకరించి ఇంటి వద్దకే తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. తమ వ్యాపారం పెంచుకునేందుకు కొత్త వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. గంజాయి తాగితే ఊహా లోకంలోకి వెళ్లొచ్చని, ధైర్యం వస్తుందని నమ్మిస్తారు. కొంత గంజాయిని ఉచితంగా ఇస్తారు. ఈ విధంగా కొత్త వారిని మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. ఆ తర్వాత వారికి విక్రయిస్తున్నారు.

పోలీసులకు దొరికిన యువకుల తల్లిదండ్రులను పిలిపిస్తున్నారు. గతంలో వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి హెచ్చరించి పంపించేవారు. ప్రస్తుతం పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 30 మందిపై ఐపీసీ 290, కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు చేశారు.

పెరిగిన అమ్మకాలు

కొవిడ్‌ నేపథ్యంలో యువకులు ఇంట్లోనే ఉంటున్నారు. నిఘాకు దొరక్కుండా వాట్సాప్‌ ద్వారా మత్తు వ్యాపారం చేస్తున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో కొందరు స్నేహితులతో గంజాయి తీసుకునేందుకు అనువైన స్థలాన్ని ఎంచుకుంటున్నారు. చిన్న ప్లాస్టిక్‌ సీసాతో సొంతంగా హుక్కా లాగా తయారు చేసుకుని వినియోగిస్తున్నారు. దీని వల్ల ఒకేసారి ఎక్కువ పరిమాణంలో గంజాయి శరీరంలోకి వెళ్లి నిషా ఎక్కుతుందని ఇలా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


విక్రేతలపై ప్రత్యేక నిఘా

- శ్రీనివాసులు, పోలీసు కమిషనర్‌, విజయవాడ

గరంలో గంజాయి అమ్మకాలను పూర్తిగా నిరోధించే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందులో భాగంగా పలువురు అమ్మకందారులు, వినయోగదారులపై నిఘా పెట్టాం. పలువురిని అరెస్టు చేశారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలను వినియోగించి దొరికిపోతే కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నాం. అనవసరంగా తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్ధు తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై దృష్టి సారించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని