విద్యుత్తు కనెక్షన్లకు... ఆధార్‌ అనుసంధానం
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

విద్యుత్తు కనెక్షన్లకు... ఆధార్‌ అనుసంధానం

సీపీడీసీఎల్‌ అధికారుల కసరత్తు

ఈనాడు, అమరావతి

విద్యుత్తు వినియోగదారుల ఆధార్‌ వివరాలు సేకరించేందుకు సీపీడీసీఎల్‌ అధికారులు కసరత్తు ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక విద్యుత్తు వినియోగంతో ముడిపడి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆధార్‌ సేకరణ, అనుసంధానం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఎలా నిర్వహించాలన్న అంశంపై ఇంకా స్పష్టతకు రాలేదు. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందుకు సాగనున్నారు. కనెక్షన్‌ తీసుకున్న సమయంలోని సమాచారమే ఇప్పటికీ దిక్కు. సంబంధిత వ్యక్తి మరణించినా, ఇంకా ఆ పేరే దస్త్రాల్లో ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత వినియోగదారుడి సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు.

సీపీడీసీఎల్‌ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో మొత్తం 48.29 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. విజయవాడలో 17,39,621, గుంటూరులో 14,56,171, సీఆర్‌డీఏలో 3,86,524, ఒంగోలులో 12,47,305 కనెక్షన్లు ఉన్నాయి. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులను నిర్ణయించేందుకు పలు ప్రభుత్వ శాఖలు లబ్ధిదారుల ఆధార్‌ నెంబర్లను విద్యుత్తు శాఖకు ఇచ్చి వినియోగించుకున్న యూనిట్ల సమాచారాన్ని అడుగుతున్నాయి. ఈ వివరాలు సిద్ధంగా లేకపోవడంతో సమాచారం ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు అన్నీ ఆధార్‌తో అనుసంధానం అవుతున్నాయి. దీంతో విద్యుత్తు కనెక్షన్లను కూడా చేయాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో ఎస్పీడీసీఎల్‌లో భాగంగా ఉన్నప్పుడు కొన్ని కనెక్షన్లకు ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఆ వివరాలు సమగ్రంగా లేవు.

* దీనికి తోడు ఇటీవల కాలంలో తమ కనెక్షన్‌కు వేరొకరి ఆధార్‌ అనుసంధానం అయిందని వచ్చే ఫిర్యాదులు బాగా పెరిగాయి. తమకు సంబంధం లేని మీటరు నెంబరు ఆధార్‌తో లింక్‌ అయిందని, దీనిని మార్చమని వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ పూర్తి స్థాయిలో సేకరించనున్నారు. గతంలో కనెక్షన్‌ తీసుకున్న వారిలో చాలా మంది మరణించారు. ఇటువంటి వారి స్థానంలో ఆ కుటుంబంలోని  వారసుల పేర్లను చేర్చి, ఆధార్‌తో అనుసంధానించనున్నారు.

కేవైసీ పునః ప్రారంభం

సంస్థాగత లోపాలను సవరించుకునేందుకు గత ఏడాది ప్రారంభించిన ప్రత్యేక సర్వే పూర్తి కాలేదు. కొవిడ్‌ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. ఇంటింటికీ వెళ్లి వినియోగదారుల సూచనలు, ఫిర్యాదులతో పాటు వారి వివరాలను తీసుకున్నారు. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నది లక్ష్యం. మీటరులో ఇబ్బందులు, సరఫరాలో అంతరాయం, ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం, తదితర సమస్యలు తక్షణం పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీని వల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మీ వినియోగదారుని తెలుసుకోండి’ అనే కార్యక్రమాన్ని లాంఛనంగా మొదలు పెట్టారు. తొలుత వినియోగదారుల సమస్యలు తెలుసుకుంటారు. తర్వాత కనెక్షన్‌కు సంబంధించి డిస్కమ్‌ వద్ద ఉన్న వివరాలతో సరిపోల్చుకుంటారు. దీని ఆధారంగా విద్యుత్తు శాఖ వద్ద ఉన్న వివరాలను నవీకరించనున్నారు. ఆగిన ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించి, తిరిగి పూర్తి చేయాలని అధికారులు తలపోస్తున్నారు. వినియోగదారుల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా ఏయే సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాటిని పరిష్కరించేందుకు గల మార్గాలను సిద్ధం చేయాలని ఆలోచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని