భవానీలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలి
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

భవానీలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌


కరపత్రాలు విడుదల చేస్తున్న ఛైర్మన్‌ సోమినాయుడు, ఈఓ భ్రమరాంబ, స్థానాచార్య శివప్రసాదశర్మ తదితరులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : భవాని దీక్షాధారులు దసరా ఉత్సవాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించి అమ్మవారిని దర్శించుకోవాలని దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు అన్నారు. అక్టోబర్‌ 7 నుంచి 15 వరకు దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే దసరా ఉత్సవాల్లో చివరి రెండు రోజులు భవానీ దీక్షాధారులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో గురుభవానీలతో ఈఓ భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు అవగాహన సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాల కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం సోమినాయుడు మాట్లాడుతూ కొవిడ్‌ మూడో దశను దృష్టిలో ఉంచుకొని భవానీలు, సాధారణ భక్తులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం విధిగా పాటించాలన్నారు. భవానీ దీక్షాధారుల కోసం అక్టోబరు 15 తరువాత మరో మూడు రోజులు ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. ఈఓ భ్రమరాంబ మాట్లాడుతూ ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, దర్శనం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గురుభవానీలు గణేష్‌, ఎల్లారావు మాట్లాడుతూ ఇరుముడులు అమ్మవారి సన్నిధిలో తీసేందుకు దేవస్థానం అధికారులు, పాలకమండలి సభ్యులు సహకరించాలని కోరారు. స్థానాచార్య శివప్రసాదశర్మ, సూపరింటెండెంట్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని