రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన
eenadu telugu news
Updated : 17/09/2021 05:15 IST

రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన

కోడెల రెండో వర్ధంతి సభలో మాజీ మంత్రులు


సభలో మాట్లాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చిత్రంలో అయ్యన్నపాత్రుడు, జీవీ ఆంజనేయులు, రాజకుమారి తదితరులు

కండ్లగుంట(నకరికల్లు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన కొనసాగుతోందని, జగన్‌ సీఎం అయ్యాక 300 మంది మహిళలపై ఘోరాలు జరిగాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మాజీ శాసనసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు రెండో వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో గురువారం కోడెల విగ్రహావిష్కరణ జరిగింది. కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడుతోపాటు మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాదు, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. శివప్రసాద్‌ తనయుడు డాక్టరు కోడెల శివరామ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తెదేపా కార్యకర్తలు, కోడెల అభిమానులు తరలిరావడంతో కండ్లగుంట వీధులు కిక్కిరిశాయి. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఎన్నో అభివృద్ధి పనులు చేసి డాక్టర్‌ కోడెల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కోడెల ఆత్మహత్యకు వైకాపా నాయకులే కారణమని విరుచుకుపడ్డారు. ఆయన చేసిన సేవలను పార్టీ మరిచిపోదని, ఆ కుటుంబానికి అండగా నిలస్తుందన్నారు. టీఎంసీలు తెలియని వ్యక్తి ఇరిగేషన్‌ మంత్రి, పోలీసులు సెల్యూట్‌ చేయని మహిళ హోంమంత్రి అయ్యారని, బూతులు మాట్లాడే వ్యక్తి పౌరసరఫరాల శాఖ మంత్రి అయ్యారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. దిశ చట్టమే లేనప్పుడు స్టేషన్లు ప్రారంభించడం ఎందుకని ప్రశ్నించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం తప్పుడు కేసులతో దుర్మార్గమైన పాలన చేస్తోందన్నారు. వైకాపాకు రోజులు దగ్గర పడ్డాయని, ఆపార్టీ నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అనంతరం గ్రామంలో రెండు చోట్ల కోడెల, ఎన్టీఆర్‌, గ్రామ మునసబు రావెల సైదయ్యల విగ్రహాలను నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామానాయుడు, నాయకులు జీవీ ఆంజనేయులు, నన్నపనేని రాజకుమారి, నసీర్‌ అహ్మద్‌, చలమారెడ్డి, డాక్టరు చదలవాడ ఆరవిందబాబు, రావెల సత్యనారాయణ, అబ్బయ్య, సర్పంచి రావెల సాయినవీన్‌కుమార్‌, అహ్మద్‌బుడే తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సత్తెనపల్లి నుంచి కండ్లగుంట వరకు తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా తరలివచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని