అమ్మకు వేదనే మిగిలింది
eenadu telugu news
Updated : 30/07/2021 07:41 IST

అమ్మకు వేదనే మిగిలింది

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం


సెంట్రల్‌ డివైడర్‌పై పడి తలకు బలమైన గాయాలతో చనిపోయిన కట్టా మహేష్‌

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: ‘స్నేహితులు వచ్చారు... వారితో మాట్లాడి వస్తాను...’ అని అమ్మతో చెప్పిన మాటలే ఆ యువకుడి ఆఖరి మాటలు అయ్యాయి. ఇంటికి వస్తాడని అర్ధరాత్రి వరకు ఎదురుచూస్తున్న ఆ తల్లికి పోలీసులు ఫోన్‌ చేసి రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించాడన్న సమాచారం చెప్పడంతో ఆమె కుప్పకూలిపోయారు. కుటుంబానికి ఆధారం అవుతాడనుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కన్నతల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత మహాత్మాగాంధీ రోడ్డులోని బందరులాకులు కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కట్టా మహేష్‌ (26) మృతి చెందిన విషాద ఘటన చూపరులను కంట తడి పెట్టించింది. మొగల్రాజపురం నాపరాళ్ల బజారు ఆర్‌సీఎం చర్చి రోడ్డుకు చెందిన కట్టా మహేష్‌ ఇంజినీరింగ్‌ చదివారు. మ్యూజియం రోడ్డులోని ఒక ఆటోమొబైల్‌ దుకాణంలో పని చేస్తున్నారు. రోజూ ఉదయం 10 గంటలకు వెళ్లి రాత్రి 10 గంటలకు వస్తారు. 28న రాత్రి 10.30 గంటలైనా ఇంటికి రాకపోవడంతో తల్లి రమాదేవి కుమారుడికి ఫోన్‌ చేశారు. స్నేహితులు వచ్చారని వారితో మాట్లాడి వస్తానని చెప్పడంతో కుమారుడి కోసం ఎదురుచూశారు. 29న తెల్లవారుజామున 4 గంటల సమయంలో గవర్నర్‌పేట పోలీసులు ఫోన్‌ చేసి మహేష్‌ బందరులాకులు వద్ద సెంట్రల్‌ డివైడర్‌ను ఢీకొని మరణించాడని చెప్పడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు.

వేగమే కారణమా?: ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ సెంట్రల్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వేగానికి ఎగిరి సెంట్రల్‌ డివైడర్‌పై చెట్టును ఢీకొట్టి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని