Published : 22/04/2021 02:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వివాహిత బలవన్మరణం

పెనమలూరు, న్యూస్‌టుడే: కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలో పెదపులిపాకకు చెందిన మానికొండ శివకోటేశ్వరరావు, అరుణ(32)లకు 2013లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. శివకోటేశ్వరరావు మీ-సేవ కేంద్రం నిర్వహిస్తుంటాడు. వివాహ సమయంలో అరుణకు పుట్టింటి వారు 20 సెంట్ల స్థలాన్ని కట్నంగా ఇచ్చారు. పెళ్లయిన కొంత కాలం నుంచి భర్త ఈ స్థలాన్ని తన పేరుపై రాయించుకు రావాలని అరుణను వేధించడం మొదలు పెట్టాడు. అప్పట్నించి వీరిద్దరి నడుమ విభేదాలు, గొడవలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం భార్యను పుట్టింటికి పంపేయగా పెద్దల సమక్షంలో దంపతులిద్దరికీ సర్దిచెప్పారు. నాలుగు నెలల క్రితం అరుణ చెల్లెలు వివాహం  జరగ్గా అప్పట్నించి శివకోటేశ్వరరావు తిరిగి స్థలంపై వివాదానికి దిగుతూ రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ నిత్యం గొడవ చేస్తున్నాడు. ఇందుకు అత్తమామలు సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం అరుణ ఇంట్లో సీలింగ్‌ ఫ్యానుకు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించడంతో మరిది శ్రీనివాసరావు గుర్తించి 108కు, పోలీసులకు సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి ఈమెను పరిశీలించగా అప్పటికే అరుణ మృతి చెందింది. ఆమె తండ్రి పెదపూడి నాగేశ్వరరావు, బంధువులు వచ్చి అరుణ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతరమయ్యారు. కట్నంగా ఇచ్చిన స్థలాన్ని భర్త పేరుపై రిజిస్టర్‌ చేయలేదనే ఆగ్రహంతో  తన కుమార్తెను భర్త, అత్తమామలే కొట్టిచంపడం లేదా వీరి వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడం జరిగి ఉంటుందని మృతురాలి తండ్రి నాగేశ్వరరావు అనుమానం  వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భర్త శివకోటేశ్వరరావు, అత్తమామలు నాగలక్ష్మి, ఏడుకొండలుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని