Published : 22/04/2021 02:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నమ్మించి మోసం చేసి.. మహిళతో రెండో వివాహం

పెందుర్తి (విశాఖ), న్యూస్‌టుడే: మ్యాట్రీమోనీ వెబ్‌సైట్లో పరిచయమైన మహిళను నమ్మించి రెండో వివాహం చేసుకున్న వ్యక్తిపై విశాఖ జిల్లా పెందుర్తి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి సీఐ అశోక్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెందుర్తి మండలం నరవ దరి గవరజగ్గయ్యపాలెం ప్రాంతానికి చెందిన మహిళ(27)కి వాకలగడ్డ సాంబశివరావు అనే వ్యక్తికి ఓ మ్యాట్రీమోనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. సాంబశివరావు విజయవాడలోని ఓ కంపెనీలో సీఈవోగా పనిచేస్తున్నట్లు ఆమెను నమ్మించి 2020 ఆగస్టు నెలలో విశాఖలోని సంపత్‌ వినాయక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను విజయవాడకు కాపురానికి తీసుకెళ్లాడు. ఇటీవల తనపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరపడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పి ఆ మహిళ నుంచి 12 తులాల బంగారం, ఆమె కుటుంబ సభ్యుల నుంచి రూ.10 లక్షల వరకు నగదు తీసుకుని ఆమెను గవరజగ్గయ్యపాలెంలోని కుటుంబ సభ్యుల వద్ద ఉంచాడు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉండడంతో వీరంతా విజయవాడలో ఆరా తీయగా అప్పటికే అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ మహిళ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని