Published : 22/04/2021 02:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యక్తి దారుణ హత్య

కంచికచర్ల, న్యూస్‌టుడే: ఓ వ్యక్తిని హత్య చేయడమే కాకుండా.. పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన బుధవారం కలకలం రేపింది. మండల పరిధిలోని గనిఆత్కూరు శివారులో కాలిన మృతదేహం ఉందనే సమాచారం పోలీసులకు అందడంతో నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, గ్రామీణ సీఐ కె.సతీష్‌, ఎస్సై ఎస్‌.రంగనాథ్‌ అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తి ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన కొత్తపల్లి సాంబశివరావు(42)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మూలపాడుకు చెందిన సాంబశివరావు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి 7.30 గంటల వరకూ ఇంట్లోనే ఉన్నారు. తెలిసిన వ్యక్తి నుంచి ఫోన్‌ రావడంతో బయటకు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ద్విచక్రవాహనంపై బయలు దేరారు. గనిఆత్కూరు శివారులోని పంట పొలాల సమీపానికి చేరుకున్న అతని కళ్లలో కారం కొట్టి బలమైన ఆయుధంతో దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు ఘటన స్థలంలో ఆధారాలు లభించాయి. తల వెనుక గట్టి దెబ్బ తగలడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులకు దొరక్కుండా.. ఆధారాలు లేకుండా చేయాలని మృతదేహంపై గడ్డి వేసి పెట్రోలు పోసి నిప్పటించారు. ఎంతకీ కాలకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. బుధవారం ఉదయం గేదెలు మేపేందుకు వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌లను రప్పించి ఆధారాలు సేకరించారు. హత్యకు గల కారణాలు ఏమిటి? ఒక్కడే చేశాడా? ఇంకా ఎవరైనా సహకరించారా? తదితర వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంబశివరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని