Published : 22/04/2021 02:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా ఫిర్యాదులా 1902కు ఫోన్‌ చేయండి

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో కరోనా వైద్య పరీక్షల కోసం, ఆసుపత్రుల్లో చేరడం కోసం ‘104’ కాల్‌ సెంటర్‌కు ఫోను చేయాలని, వీటిపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే 1902 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని కలెక్టరు ఇంతియాజ్‌ బుధవారం విడుదల ఓ ప్రకటనలో ప్రజలకు సూచించారు. ప్రైవేటు ల్యాబ్‌లు, సిటీ స్కానింగ్‌, ఆర్టీపీసీఆర్‌లు చేయించుకుని నేరుగా గూడవల్లి కొవిడ్‌ కేర్‌ కేంద్రానికి వస్తున్నారని, ఇలాంటి వారు ముందుగా తమ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించాలని, వారి సూచన/సలహా మేరకు కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ఎక్కడ చికిత్స అందిస్తారో అక్కడికి మాత్రమే వెళ్లాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్‌ పరీక్షా కేంద్రాల్లోనే నిర్ధారణ కచ్చితత్వంగా ఉంటుందని, ప్రభుత్వ లెక్కల్లోకి చేరతాయని, సదరు బాధితునికి ఒక గుర్తింపు నంబరును కేటాయిస్తారని, తద్వారా ఆరోగ్య పరిరక్షణకు, అవసరమైన సలహాలు, పర్యవేక్షణకు అవకాశం ఉంటుందని వివరించారు.
గూడవల్లి కేంద్రంలో చేరాలంటే..
విజయవాడ గ్రామీణ మండలం గూడవల్లిలోని కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో చేర్చుకోవడానికి అవసరమైన కారణాలను కలెక్టరు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొవిడ్‌ పరీక్షా కేంద్రంలో పాజిటివ్‌ అని నిర్ధారణ కావాలి. ఆర్‌.టి.పి.సి.ఆర్‌. పరీక్ష ద్వారా గుర్తింపు సంఖ్య పొంది, తక్కువ లక్షణాలు కలిగి, ఇంట్లో ఎలాంటి ప్రత్యేక గది లేని వారిని, ఇతర ప్రాంతానికి చెందిన వారిని గూడవల్లిలో చేర్చుకుంటారని వివరించారు. ఇది ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం తాత్కాలిక కేంద్రమే తప్ప ఆసుపత్రి కాదని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టరు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని